epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

కరెంటు ఛార్జీలను తగ్గించండి.. ఇరిగేషన్ డిపార్టుమెంట్ రిక్వెస్ట్

కలం డెస్క్ : వివిధ సాగునీటి ప్రాజెక్టుల పంపింగ్ స్టేషన్లకు విద్యుత్ శాఖ (Electricity Department) ఫిక్స్ చేసిన టారిఫ్‌ను తగ్గించాలని, డిమాండ్ ఛార్జీల వడ్డింపు వద్దంటూ ఇరిగేషన్ డిపార్టుమెంట్ (Irrigation Department) రిక్వెస్ట్ చేసింది. విద్యుత్ ఉత్పత్తికి ఎంత ఖర్చవుతున్నదో అంతే మొత్తంలో టారిఫ్ ఉండాలని కోరింది. ప్రతీ కిలో వోల్ట్ కు నెలకు రూ. 300 చొప్పున వసూలు చేస్తున్న డిమాండ్ ఛార్జీలను పూర్తిగా మినహాయించాలని కోరింది. మీడియా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు చెందిన మోటార్ పంపులు సోలార్ ఎనర్జీతో నడుస్తున్నందున పవర్ గ్రిడ్‌మీద లోడ్ పడదని, అలాంటప్పుడు డిమాండ్ ఛార్జీలను వసూలు చేయడం సమంజసం కాదని వివరించింది. ఇక నుంచి ఇరిగేషన్ శాఖ నుంచి వసూలు చేయవద్దని కోరింది. వ్యవసాయ పంపుసెట్లు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పంపింగ్ స్టేషన్లు, మిషన్ భగీరథ, జలమండలి పంపులు.. వీటన్నింటినీ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న థర్డ్ డిస్కమ్‌ పరిధిలోకి చేరుస్తూ ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ నుంచి ఈ సూచన రావడం గమనార్హం.

రాయల్టీ, విద్యుత్ ఉత్పత్తి ఖర్చు సమం :

వర్షాకాలంలో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్లు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయని, అవి వాడుకున్న నీటికి రాయల్టీ రూపంలో ఇరిగేషన్ శాఖకు (Irrigation Department) ఆదాయం సమకూరుతుందని ఆ లేఖలో సాగునీటిపారుదల శాఖ వివరించింది. ఒక మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తికి ఒక టీఎంసీ మేర నీటిని వాడుకున్నందుకు వెయ్యి రూపాయలను రాయల్టీ రూపంలో ఇరిగేషన్ శాఖకు విద్యుత్ జెన్‌కో సంస్థ చెల్లిస్తుందని గుర్తుచేసింది. ఒక మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడుకున్నందున ఇరిగేషన్ శాఖ సైతం వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని, దీన్ని ట్రాన్స్ కో యూనిట్ లెక్కల్ అడ్జస్ట్ చేయాలని కోరింది. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పంపింగ్ స్టేషన్లు వాడుకుంటున్న కరెంటుకు విద్యుత్ శాఖ ఫిక్స్ చేస్తున్న టారిఫ్ విద్యుత్ ఉత్పత్తికి సమంగా ఉండేలా నిర్ణయం తీసుకోవాలని కోరింది. ప్రస్తుతం ఒక్కో యూనిట్‌కు రసూ. 6.30 చొప్పున వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నది.

మీడియం పంపుసెట్లు ఆరు నెలలే :

మేజర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పంపుసెట్లు ఏడాదిలో 45-60 రోజుల పాటు మాత్రమే పనిచేస్తాయని, వరద నీటిని ఎత్తులో ఉన్న రిజర్వాయర్లలోకి పంపింగ్ చేస్తాయని ఇరిగేషన్ శాఖ పేర్కొన్నది. ఇలాంటి నాలుగు ప్రాజెక్టులు 2819 మెగావాట్ల విద్యుత్‌ను వాడుతున్నాయని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో తొమ్మిది అదనంగా చేరుతాయని పేర్కొన్నది. కొత్త పంపుసెట్లకు 7348 మెగావాట్లు అవసరమవుతుందని పేర్కొన్నది. కానీ ఇవి 80% లోడ్ మాత్రమే వాడుతున్నందున ప్రస్తుత పంపుసెట్లకు 2375 మెగావాట్లు, కొత్తగా వచ్చేవాటికి 5878 మెగావాట్లు అవసరం ఉంటుందని పేర్కొన్నది. వర్షాకాలంలో ఏసీలు పనిచేయనందున డొమెస్టిక్, కమర్షియల్ విద్యుత్ వినియోగం తక్కువని, డిమాండ్ పెద్దగా ఉండదని పేర్కొన్నది. ఈ కాలంలో జలవిద్యుత్ ఉత్పత్తి కూడా ఉంటున్నందున గ్రిడ్‌ బ్యాలెన్స్ కోసం పంపుసెట్ల లోడ్‌ ఉంటుందని వివరించింది. మరోవైపు వ్యవసాయ పంపుసెట్ల వినియోగం కూడా తక్కువే ఉంటుందని, గ్రిడ్‌పై భారం ఉండదని పేర్కొన్నది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని విద్యుత్ టారిఫ్‌ను తగ్గించాలని కోరింది.

మీడియం, స్మాల్ లిఫ్ట్ పంపుసెట్లదే ప్రధాన పాత్ర:

మీడియం, స్మాల్ లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థ తెలంగాణ సాగునీటిరంగంలో కీలక భూమిక పోషిస్తుందని, ఏడాదిలో దాదాపు 180 రోజుల పాటు ఈ పంపింగ్ స్టేషన్లు పనిచేస్తాయని ఇరిగేషన్ శాఖ పేర్కొన్నది. ప్రస్తుతం ఈ కేటగిరీకి చెందిన 55 పంపింగ్ స్టేషన్లు 5031 మెగావాట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నాయని, కొత్తగా మరో 25 స్టేషన్లు వచ్చే ఏడాదికి రెడీ అవుతాయని, వీటికి 993 మెగావాట్లు అదనంగా అవసరమవుతుందని పేర్కొన్నది. వీటి ద్వారా నేరుగా పొలాలకు నీరు అందే అవకాశం ఉన్నందున రైతులు వారి వ్యవసాయ పంపుసెట్లను వాడుకోవాల్సిన అవసరమే రాదని, పైగా భూగర్భ జలాలు పెరిగినందున వాటి వినియోగం కూడా గణనీయంగా తగ్గుతుందని వివరించింది. దీనికి తోడు రైతులు 20 కిలోవాట్‌ల మోటార్లకు బదులుగా ఇక నుంచి 5 కిలోవాట్ల స్థాయికి తగ్గించుకుంటారని, విద్యుత్ వినియోగం తగ్గుతుందని పేర్కొన్నది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఒక్కో యూనిట్‌కు వసూలు చేస్తున్న రూ 6.30 టారిఫ్‌ను తగ్గించడంతో పాటు డిమాండ్ చార్జీని పూర్తిగా ఎత్తివేయాలని విద్యుత్ శాఖను ఇరిగేషన్ శాఖ కోరింది.

Read Also: ట్రిపుల్‌ఆర్ అలైన్‌మెంట్ మార్చండి: కవిత

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>