Mobile Popup Ad
Mobile Popup Ad

నితీష్ రెడ్డిపై ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం

క‌లం, వెబ్ డెస్క్‌: ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ (KKR)పై భారీ విజయం సాధించి సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బోణీ కొట్టింది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన యంగ్ ప్లేయర్ నితీష్ రెడ్డి (Nitish Reddy)పై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) ప్రశంసల వర్షం కురిపించారు. సీజన్ ఆరంభంలో ఆర్‌సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌లో నితీష్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి కేవలం ఒక్క పరుగుకే వెనుదిరిగారు. అయితే కేకేఆర్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో మేనేజ్‌మెంట్ అతని బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చి ఆరో స్థానానికి పంపింది. ఈ నిర్ణయం సరైనదని పఠాన్ అభిప్రాయపడ్డారు. జాగ్రత్తగా ఆడుతూ భాగస్వామ్యాలు నెలకొల్పే బాధ్యతను నితీష్ చక్కగా నిర్వర్తించారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా క్లాసెన్‌తో కలిసి నితీష్ నెలకొల్పిన 82 పరుగుల భాగస్వామ్యం జట్టును పటిష్ట స్థితిలో నిలిపిందని కొనియాడారు.

నితీష్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించడం పఠాన్‌ను (Irfan Pathan) విశేషంగా ఆకట్టుకుంది. ప్రిసీజన్ క్యాంప్‌లో నితీష్ తన బౌలింగ్‌పై కష్టపడ్డారని, దీనివల్ల అతని వేగం పెరిగిందని పఠాన్ విశ్లేషించారు. ప్రస్తుతం నితీష్ నిలకడగా గంటకు 135 కిలోమీటర్ల వేగంతో బంతులు వేస్తున్నారని, వైట్ బాల్ క్రికెట్‌లో అతని గ్రాఫ్ పెరుగుతోందని ప్రశంసించారు. ఈ మ్యాచ్‌లో నితీష్ 24 బంతుల్లో 39 పరుగులు చేయడంతో పాటు రెండు కీలక వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’గా నిలిచారు.

మరోవైపు హెన్రిచ్ క్లాసెన్ ఇన్నింగ్స్‌పై కూడా పఠాన్ స్పందించారు. క్లాసెన్ 52 పరుగులు చేసినప్పటికీ, అది అతని అత్యుత్తమ ఫామ్ కాదని అభిప్రాయపడ్డారు. ఆఫ్‌ స్టంప్‌ బయట ఆడేటప్పుడు క్లాసెన్ కొంచెం ఇబ్బంది పడ్డారని, అయినప్పటికీ బౌండరీలు బాదడం విశేషమన్నారు. సీనియర్ ప్లేయర్ పాట్ కమిన్స్ గాయపడిన సమయంలో క్లాసెన్ ఫామ్‌లోకి రావడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని పఠాన్ తెలిపారు. ఈ 65 పరుగుల విజయంతో ఎస్‌ఆర్‌హెచ్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి చేరుకుంది. హైదరాబాద్ తన తదుపరి మ్యాచ్‌లో ఆదివారం మధ్యాహ్నం లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది.

Read Also: పంజాబ్‌పై సంజూ పంజా విసరడం పక్కా: శ్రీకాంత్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>