ఇదిలా ఉంటే తాజాగా సునీల్ కుమార్ వివాదాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గాంధీ గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన సునీల్ కుమార్ (PV Sunil Kumar) మాట్లాడుతూ.. కాపులు, దళితులు కలవాలని పిలుపునిచ్చారు. అప్పుడు ఏపీలో అధికారం వారి సొంతం అవుతుందని వ్యాఖ్యానించారు. కాపులు ముఖ్యమంత్రిగా, దళితులు డిప్యూటీ సీఎంగా ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే అసలు ఆయన ఈ ప్రతిపాదన ఎందుకు తీసుకొచ్చారు? ఎవరికి మేలు చేసేందుకు ఇలా మాట్లాడారు? అన్న చర్చ సాగుతోంది. గత ఎన్నికల సమయంలో కాపులు టీడీపీకి మద్దతు ఇచ్చినట్టు విశ్లేషణలు ఉన్నాయి. ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా కాపు సామాజికవర్గానికి చెందిన నేతే. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిగా ఏర్పడటంతో గత ప్రభుత్వంలో కాపులు మూకుమ్మడిగా కూటమికి మద్దతు ఇచ్చారని చెబుతుంటారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఏపీలో దళితులు వైసీపీ మద్దతు దారులు అని చెబుతుంటారు. కాబట్టి ఇప్పుడు కాపులు, దళితులు కలవాలని ఆయన పిలుపు నివ్వడం గమనార్హం. తన అభిమాన నేత జగన్ మోహన్ రెడ్డికి మేలు చేసేందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేశారా? లేదంటే పీవీ సునీల్ కుమార్ రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నారా? అన్న చర్చ కూడా సాగుతోంది. అయితే ఆయన చేసిన కామెంట్లపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించినట్టు సమాచారం. ఈ ఐపీఎస్ అధికారి మీద క్రమశిక్షణాపరమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.
ఏపీలో కులరాజకీయాలకు కొదవ లేదు. నిత్యం కులాల చిచ్చు అక్కడ రగులుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం అంతా ప్రశాంతంగానే ఉంది. ఇటువంటి సమయంలో సునీల్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటు తెలంగాణలోనూ బీసీలకు రాజ్యాధికారం కావాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఇదే సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు ఏపీలోనూ వినపడుతుండటం గమనార్హం. మరి ఈ కామెంట్లు వెంటనే చల్లారుతాయా? లేదంటే సునీల్ కుమార్ ఏదైనా కార్యాచరణ సిద్ధం చేసుకుంటారా? అన్నది వేచి చూడాలి. సునీల్ కుమార్ వ్యాఖ్యలపై ఇప్పటివరకు టీడీపీ, వైసీపీ నేతల నుంచి పెద్దగా స్పందన రాలేదు.


