పార్లమెంట్(Parliament) శీతాకాల సమావేశాల్లో రెండో రోజూ లోక్‌సభ అట్టుడికింది. సర్, సంచార్ సాథీ యాప్ పై విపక్షాల ఆందోళనలు,నిరసనల మధ్య సభ రేపటికి వాయిదా పడింది. మంగళవారం సభ ప్రారంభమైన కాసేపటికే ప్రతిపక్ష సభ్యులు ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(ఎస్ఐఆర్-సర్)పై చర్చకు పట్టుపట్టారు. స్పీకర్ ఓం బిర్లా అనుమతించకపోవడంతో నిరసనలకు దిగారు. పోడియం వద్దకు వెళ్లి సభా కార్యక్రమాలకు అడ్డు తగిలారు. ‘సర్’పేరుతో కేంద్రం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతోందని విపక్షసభ్యులు నినదించారు. ప్రతిపక్షాల ఓట్లను తొలగించేందుకు ‘సర్’తో కుట్ర చేస్తోందని ఆరోపించారు. అలాగే ఈవీఎంలను, ఈసీని అడ్డుపెట్టుకొని ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడుతున్నారంటూ ‘సర్ పే చర్చా’, ‘ఓట్ చోర్- గద్దె చోడ్’ అంటూ నినాదాలు చేశారు. వారిని శాంతపరిచేందుకు స్పీకర్ ఓం బిర్లా ప్రయత్నించినప్పటికీ కుదరకపోవడంతో మొదట సభను 12గంటలకు వాయిదా వేశారు. అనంతరం మళ్లీ సమావేశమైనప్పటికీ పరిస్థితి ఏ మాత్రం మారకపోవడంతో మళ్లీ వాయిదా వేశారు.
ఈ సందర్భంగా స్పీకర్ ఓం బిర్లా(Om Birla) ప్రతిపక్ష సభ్యుల తీరును తప్పుపట్టారు. చర్చించాల్సిన సమస్యలు అనేకం ఉండగా, ప్రతిపక్షాలు అనవసర విషయాలకు పట్టుబట్టడం భావ్యం కాదన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతిని గుర్తుపెట్టుకొని దానికి తగినట్లు నడచుకోవాలన్నారు. పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు(Kiren Rijiju) సైతం ప్రతిపక్షాల తీరును ఆక్షేపించారు. ‘మాజీ ప్రధాని వాజ్‌పేయీ గారు ఎన్నికల్లో ఓడిపోయారు. నేనూ ఓడిపోయాను. కానీ, మేము బాధపడలేదు. రాద్దాంతం చేయలేదు. ప్రస్తుత ప్రతిపక్షం మాత్రం తమ ఓటమికి ఇప్పటికీ బాధపడుతోంది. అందుకే ఇలాంటి అనవసర విషయాలను సభలో చర్చించాలంటోంది’ అంటూ రిజుజు మండిపడ్డారు.
రెండో సారి వాయిదా అనంతరం విపక్ష సభ్యులు పార్లమెంట్(Parliament) ఆవరణలో సర్, సంచార్ సాథీ యాప్‌లకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. అనంతరం మధ్యాహ్నం 2గంటలకు మళ్లీ సభ సమావేశమవగా, పరిస్థితి ఏ మాత్రం మారలేదు.కొందరు విపక్ష సభ్యులు ప్రభుత్వం తీరును నిరసిస్తూ వాకౌట్ చేశారు.మిగిలినవాళ్లు ఆందోళన కొనసాగించారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా సభను రేపటికి వాయిదా వేశారు.
Read Also: పోక్సో కేసులో కర్ణాటక మాజీ సీఎంకు తాత్కాలిక ఊరట
Follow Us on: Facebook


