కలం డెస్క్ : ప్రతీ మొబైల్ ఫోన్‌లో సంచార్ సాథీ (Sanchar Saathi App) యాప్‌ను ప్రీ-ఇన్‌స్టాల్ చేయాలని కేంద్ర టెలికామ్ శాఖ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయబోమని అమెరికాకు చెందిన యాపిల్ (Apple) కంపెనీ స్పష్టం చేసింది. ఐ-ఫోన్ (iPhone) వినియోగదారుల హక్కుల ప్రైవసీ, గోప్యత విషయంలో రాజీపడబోమని లిఖితపూర్వకంగా స్పష్టం చేసినట్లు వార్తా సంస్థలు పేర్కొన్నాయి. యాపిల్ కంపెనీ నుంచి ఈ సమాధానం రావడంతో పాటు విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసింది. ఈ మొబైల్ యాప్ తప్పనిసరికాదని, వినియోగదారులు ఎప్పుడైనా డిలీట్ చేసుకోవచ్చని వివరణ ఇచ్చింది. కానీ యాపిల్, శాంసంగ్ (Samsung), షావోమీ (Xiaomi) కంపెనీలకు రాసిన సర్క్యులర్‌లో మాత్రం తప్పనిసరిగా కొత్త మొబైల్ ఫోన్‌లలో ప్రీ-ఇన్‌స్టాల్ చేసి విక్రయించాలని, దాన్ని డిలీట్ చేసుకోకుండా, డిజేబుల్ చేసుకోకుండా ఆపరేటింగ్ సిస్టమ్‌లో మార్పులు చేయాలని కేంద్ర సర్కార్ సూచించింది.
మా పాలసీలకు ఈ నిర్ణయం వ్యతిరేకం :
భారత్‌లో మాత్రమే కాక ఏ దేశంలోనూ ఇలాంటి ఆదేశాలను తాము పాటించబోమని, ఐఓఎస్ ఆపరేటింగ్ ఎకో సిస్టమ్‌లో వినియోగదారుల ప్రైవసీ (Privacy), గోప్యత కోసం రూపొందించుకున్న ప్రమాణాలకు ఈ ఆదేశాలు విరుద్ధమైనవని యాపిల్ తన సమాధానంలో పేర్కొన్నట్లు తెలిసింది. భారత ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలను అమలు చేయడమంటే వినియోగదారుల భద్రతకు అతి పెద్ద ప్రమాదం అనే తాము భావిస్తున్నట్లు స్పష్టత ఇచ్చింది. కేంద్ర టెలికామ్ డిపార్టుమెంటులోని పలువురు అధికారులకు సైతం సంచార్ సాథీ యాప్(Sanchar Saathi App) ఇన్‌స్టాల్ చేసుకోవడంపై భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు తెలిసింది. ఇది కేవలం స్లెజ్ హ్యామర్ మాత్రమే కాదని, ఒక డబుల్ బ్యారెల్ గన్‌తో చేస్తున్న దాడి లాగానే ఉన్నదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. యాపిల్ కంపెనీ తరహాలోనే శాంసంగ్, షావోమీ కంపెనీలు ఎలాంటి సమాధానాన్ని ఇస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.
Read Also: స్మార్ట్ ఫోన్లలో ‘సంచార్ సాథీ’ యాప్… ఆందోళనలో యూజర్స్
Follow Us On: X(Twitter)


