కలం, వెబ్ డెస్క్: ఐపీఎల్ (IPL) అంటేనే పవర్ హిట్టింగ్. మైదానంలో బౌండ్రీల సునామీ సృష్టించాలి. అంతా ఇదే అనుకుంటారు. కానీ ఆస్ట్రేలియా యువ ఆటగాడు కూపర్ కానల్లీ (Cooper Connolly) మాత్రం.. రాణించడానికి పవర్ హిట్టింగ్ (Power Hitting) ఒక్కటే మార్గం కాదని చెప్తున్నాడు. ఐపీఎల్‌లోకి ఈ సీజన్‌తోనే అరంగేట్రం చేసిన కానలీ.. తనదైన మార్క్ ఆటతీరుతో రాణిస్తున్నారు. తాజాగా ఒక బ్యాటర్‌గా తన విజయ రహస్యాన్ని కానల్లీ వెల్లడించాడు. టీ20 క్రికెట్‌లో రాణించాలంటే కేవలం భారీ సిక్సర్లు బాదడం లేదా పవర్ హిట్టింగ్ చేయడం ఒక్కటే మార్గం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. తన అరంగేట్రం మ్యాచ్‌లోనే అజేయంగా 72 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్న అనంతరం ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత టీ20 క్రికెట్‌లో పవర్ హిట్టింగ్ అనేది ఒక ముఖ్యమైన భాగమని అంగీకరిస్తూనే, ఆటలో రాణించడానికి ఇతర మార్గాలు కూడా ఉన్నాయని కానల్లీ (Cooper Connolly) పేర్కొన్నారు. ప్రతి ఆటగాడికి కొన్ని ప్రత్యేక బలాలు ఉంటాయని, తన బలానికి అనుగుణంగా ఆడటమే తనకు ఇప్పటి వరకు విజయాన్ని అందించిందని వివరించారు. జట్టు అవసరాలకు తగ్గట్టుగా తన బ్యాటింగ్ వేగాన్ని మార్చుకుంటూ ఆడటం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం 22 ఏళ్ల వయసులోనే మూడు ఫార్మాట్లలో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న కానల్లీ, భవిష్యత్తుపై స్పష్టమైన అవగాహనతో ఉన్నారు.
ఒక ఫార్మాట్ నుండి మరో ఫార్మాట్‌కు మారడం ఒక సవాలుతో కూడుకున్న పని అని, అయితే సీనియర్ల సలహాలు తీసుకుంటూ నిరంతరం నేర్చుకుంటున్నానని తెలిపారు. తన ఆటలో ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు ఉన్నాయని, వాటిని అధిగమించి పరిపూర్ణ ఆటగాడిగా మారడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రషీద్ ఖాన్, రబాడ వంటి అగ్రశ్రేణి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న కానల్లీ, పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్‌లో కీలక ఆటగాడిగా మారారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, కోచ్ రికీ పాంటింగ్‌ల మార్గదర్శకత్వంలో తన ఆటను మరింత మెరుగుపరుచుకుంటానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also: నీళ్లు ఎక్కువగా తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా?
Follow Us On : WhatsApp

