కలం, వెబ్ డెస్క్ : పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) లో తాజాగా జరిగిన ఒక మ్యాచ్ క్రికెట్ అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీసింది. కరాచీ వేదికగా జరిగిన ఈ పోరులో క్వెట్టా గ్లాడియేటర్స్, రావల్పిండి పిండీస్ జట్లు తలపడ్డాయి. అయితే మ్యాచ్ ఫలితం కంటే, మైదానంలో చోటుచేసుకున్న ఒక ఆసక్తికర ఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్ (Daryl Mitchell) క్రీజులో ఉన్న సమయంలో, పాకిస్థాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. తారిక్ బంతిని వేయడానికి ముందుగా తన రన్-అప్‌లో ఒక క్షణం ఆగి, ఆ తర్వాత బంతిని విడుదల చేస్తారు. ఈ అసాధారణ పద్ధతి బ్యాటర్ రిథమ్‌ను దెబ్బతీస్తుందని భావించిన మిచెల్, రెండు సార్లు క్రీజ్ నుంచి పక్కకు తప్పుకున్నారు.
ఈ సందర్భంగా మిచెల్ అంపైర్లకు ఫిర్యాదు చేస్తూ, బౌలర్ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారని తెలిపారు. అయితే అంపైర్ల చర్చ అనంతరం, తారిక్ బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్ధం కాదని స్పష్టం చేశారు. దీంతో ఆట యథావిధిగా కొనసాగింది. అయితే ఇదే ఓవర్‌లో తారిక్ బౌలింగ్‌లో మిచెల్ క్యాచ్ అవుట్ కావడం ఈ ఘటనకు మరింత ఆసక్తి జోడించింది. మ్యాచ్ చివరికి రావల్పిండి జట్టు 61 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఈ ఘటనలో మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, గతంలో రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) చేసిన సూచనను మిచెల్ అనుసరించడం. టీ20 వరల్డ్ కప్ సమయంలో అశ్విన్ మాట్లాడుతూ.. బౌలర్ కావాలనే ఆలస్యం చేస్తే, బ్యాటర్ క్రీజ్ నుంచి తప్పుకోవచ్చని, అప్పుడు అంపైర్లు ‘డెడ్ బాల్’ ప్రకటించాల్సి ఉంటుందని చెప్పారు. ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ గతంలో కూడా వివాదాస్పదమైంది. ఇప్పటికే రెండుసార్లు ఆయన యాక్షన్‌పై ఫిర్యాదులు వచ్చినప్పటికీ, విచారణలో క్లియర్ చిట్ పొందారు. అయినప్పటికీ, ఈ తాజా ఘటనతో ఫెయిర్ ప్లే, బౌలింగ్ ఎటికెట్‌పై మరోసారి చర్చ మొదలైంది.
Read Also: ఎండల నుంచి ఉపశమనానికి ఆయుర్వేద చిట్కాలు
Follow Us On : WhatsApp

