కలం, స్పోర్ట్స్: శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer).. ఐపీఎల్ 2026లో అదరగొడుతున్న కెప్టెన్, బ్యాటర్. ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. తనదైన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుంటున్న శ్రేయాస్.. తనను వదులుకున్న జట్లకు తన ఆటతోనే సమానం ఇస్తున్నాడు. తాజాగా శ్రేయాస్‌ను వదులుకోవడంపై కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మాజీ కోచ్ చంద్రకాంత్ పండిట్ కీలక విషయాలను వెల్లడించారు. 2024లో కేకేఆర్‌కు ఐపీఎల్ ట్రోఫీని అందించిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌ను జట్టు నుండి విడుదల చేయడంపై ఆయన స్పందించారు. ఇది ఒక రకంగా తాము చేసిన పొరపాటేనని ఆయన అభిప్రాయపడ్డారు.
శ్రేయాస్ లాంటి అద్భుతమైన ఆటగాడిని మిస్ అవ్వడం బాధాకరమని చంద్రకాంత్ పండిట్ పేర్కొన్నారు. జట్టు యజమానులు, మేనేజ్‌మెంట్ ఎంతో మద్దతుగా ఉన్నప్పటికీ, కొన్ని వ్యూహాత్మక కారణాల వల్ల అతన్ని వదులుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఇది కావాలని చేసిన పని కాదని, అప్పట్లో పరిస్థితులు అలా ఉన్నాయని వివరించారు. కేవలం శ్రేయాస్ మాత్రమే కాదు, ఫిల్ సాల్ట్ వంటి ఆటగాళ్లను కోల్పోవడం కూడా జట్టుపై ప్రభావం చూపిందని ఆయన అన్నారు.
శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) టీమిండియాలో చోటు కోల్పోవడంపై కూడా పండిట్ స్పందించారు. భారత జట్టులో విపరీతమైన పోటీ ఉండటం వల్ల ఇలాంటివి జరుగుతుంటాయని చెప్పారు. అయితే ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో శ్రేయాస్ ఆడుతున్న తీరు, అతని పరిణతి చూస్తుంటే మళ్ళీ జాతీయ జట్టులోకి వచ్చే సమయం ఆసన్నమైందని ఆయన అభిప్రాయపడ్డారు. వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కకపోవడం నిరాశ కలిగించినా, శ్రేయాస్ తన ఆటతో మళ్ళీ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాడని కొనియాడారు.
కేకేఆర్ నుండి విడుదలైన తర్వాత శ్రేయాస్ అయ్యర్‌ను పంజాబ్ కింగ్స్ రికార్డు స్థాయిలో ₹26.75 కోట్లకు కొనుగోలు చేసింది. అయ్యర్ నాయకత్వంలో పంజాబ్ జట్టు 2025లో ఫైనల్‌కు చేరింది. అంతేకాకుండా, ప్రస్తుత 2026 సీజన్‌లో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ ఓటమి లేకుండా జైత్రయాత్రను కొనసాగిస్తోంది. వ్యక్తిగతంగా కూడా అయ్యర్ ఈ ఏడాది 5 ఇన్నింగ్స్‌ల్లో 208 పరుగులు చేసి 52 సగటుతో అదరగొడుతున్నాడు.
Read Also: చదరంగంలో ఆరవ్ సంచలనం.. 12 ఏళ్లకే ఫైడ్ మాస్టర్‌గా రికార్డు!
Follow Us On: Instagram

