కలం డెస్క్ : ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్న ఐఏఎస్ అధికారులు(Telangana IAS Officials) రెండు గ్రూపులుగా విడిపోయారా?.. ఈ గ్రూపుల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నదా?.. ఒకదానిలో ఉండేవారితో మరొక గ్రూపులోని బ్యూరోక్రాట్లకు పొసగడంలేదా?.. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ఇచ్చే ఆదేశాలను సమిష్టిగా అమలు చేయాల్సిన ఉన్నతాధికారుల మధ్య సమన్వయం కొరవడిందా?.. ఈ విభేదాలే అధికారిక సమాచారాన్ని విపక్షాలకు చేరవేయడానికి కారణమైందా?.. ఇలాంటి అనేక ప్రశ్నలకు ఆ అధికారుల కింద పనిచేస్తున్న పలువురు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ‘ఔను’ అనే సమాధానమే వస్తున్నది. ఇద్దరు స్పెషల్ చీఫ్ సెక్రటరీల స్థాయిలోని అధికారులు రెండు వేర్వేరు గ్రూపులకు నేతృత్వం వహిస్తున్నారని, రెండు వర్గాలుగా చీలిపోయారని.. ఇలాంటి అంశాలను ధృవీకరిస్తున్నారు.
‘స్పీడ్’ వర్సెస్ ‘సైడ్’ వాట్సాప్ గ్రూపులు :
సీనియర్ ఐఏఎస్ అధికారుల మధ్య వివాదాలు తారస్థాయికి చేరడంతో రెండు వర్గాలుగా విడిపోవడంతో పాటు సమాచారాన్ని షేర్ చేసుకోడానికి వేర్వేరు వాట్సాప్ గ్రూపులు కూడా రన్ అవుతున్నాయి. ఒక వర్గం ‘స్పీడ్’ పేరుతో, మరో వర్గం ‘సైడ్’ పేరుతో వాట్సాప్ గ్రూపులు నడిపిస్తున్నారని ఆ సిబ్బందే చెప్తున్నారు. ఒక వర్గం అధికారులు సీఎం నిర్వహించే సమీక్షా సమావేశాల్లో యాక్టివ్‌గా ఉండడంతో మరో వర్గంలోని అధికారులు అసంతృప్తికి గురయ్యారని, ఆ అసహనాన్ని తట్టుకోలేకనే ఒక వర్గంగా ఏర్పడ్డారనేది కింది స్థాయి ఉద్యోగుల అభిప్రాయం. ‘స్పీడ్’ గ్రూపులో లేని అధికారుల్లో నెలకొన్న అసహనమే చివరకు కీలకమైన సమాచారాన్ని బైటకు లీక్ చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
లీకేజీలన్నీ సైడ్ గ్రూపు నుంచేనా? :
ఇటీవల ‘హిల్ట్’ పాలసీ ముసాయిదా రూపకల్పన జరిగిన తర్వాత ఆ డాక్యుమెంట్ మొత్తం బీఆర్ఎస్ లీడర్లకు చేరడంపై ముఖ్యమంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికారుల దగ్గర మాత్రమే ఉన్న సమాచారం జీవో రూపంలో అధికారికంగా రిలీజ్ కావడానికి ముందే విపక్షాలకు లీక్ కావడం వెనక ఎవరున్నారో ఆరా తీసిన ఇంటెలిజెన్స్ అధికారులకు బ్యూరోక్రాట్ల వాట్సాప్ గ్రూపుల వ్యవహారం, వారి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్, తగిన ప్రయారిటీ లభించడంలేదన్న అసంతృప్తి.. ఇలాంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. ‘స్పీడ్’, ‘సైడ్’ వాట్సాప్ గ్రూపుల ఆలోచన, ఉద్దేశం, ఫంక్షనింగ్.. ఇలాంటి అన్నింటి వెనకా సీనియర్ ఐఏఎస్‌లే(Telangana IAS Officials) ఉన్నారనేది బహిర్గతమైంది. భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్(Global Summit)ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నందున అది పూర్తయిన వెంటనే ముఖ్యమంత్రి ఈ ‘కోల్డ్ వార్’పై దృష్టి పెట్టే అవకాశమున్నది.
Read Also: రహస్య వీడియోలతో బెదిరింపులు.. పోలీసులను సైతం ట్రాప్, కిలేడీ అరెస్ట్
Follow Us On: Facebook


