కలం డెస్క్ : హైదరాబాద్ నగరాన్ని ఆనుకుని ఉన్న 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC)లో విలీనం కావడంతో విస్తీర్ణంతో పాటు జనాభా, ఓటర్లు గణనీయంగా పెరగనున్నారు. దేశంలోనే అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌గా అవతరించనున్నది. పరిపాలనా సౌలభ్యం కోసం భవిష్యత్తులో మూడు వేర్వేరు మున్సిపల్ కార్పొరేషన్లుగా అవతరించినా అప్పటివరకూ దేశంలో ఇదే అతి పెద్ద కార్పొరేషన్‌గా నిలవనున్నది. ప్రస్తుతం 625 చ.కి.మీ. విస్తీర్ణంతో ఉన్న జీహెచ్ఎంసీ కొత్తగా విలీనమవుతున్న మున్సిపాలిటీలతో కలిపితే 1942.73 చ.కి.మీ.కు చేరుకోనున్నది. ఇక జనాభా విషయానికి వస్తే ఇప్పటివరకు 1.45 కోట్ల మంది జనాభా ఉంటే ఇకపైన అది 1.65 కోట్లు దాటనున్నది. ఓటర్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుతం 98.74 లక్షల మంది ఓటర్లు ఉంటే ఇకపైన అది 1.12 కోట్లకు చేరుకోనున్నది.
రాష్ట్రంలో మూడో వంతు జనాభా ఇక్కడే :
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన బీసీ కులగణన సర్వే సందర్భంగా మొత్తం జనాభా 3.70 కోట్ల మంది ఉన్నట్లు తేలింది. కొత్త మున్సిపల్ బాడీలు జీహెచ్ఎంసీలో విలీనం కావడంతో ఈ ప్రాంత జనాభా దాదాపు 1.65 కోట్లకు చేరుకున్నది. దీంతో రాష్ట్రంలోని మొత్తం జనాభాలో దాదాపు మూడో వంతుకంటే ఎక్కువగా హైదరాబాద్‌లోనే నివసిస్తున్నట్లయింది. ఓటర్ల సంఖ్య రీత్యా చూస్తే రాష్ట్రం మొత్తం మీద 3.35 కోట్ల మంది ఉంటే, మున్సిపల్ బాడీలు జీహెచ్ఎంసీలో విలీనమైన తర్వాత ఈ ప్రాంతంలో 1.12 కోట్లు అవుతున్నది. ఈ ప్రకారం చూసినా మూడో వంతు ఓటర్లు హైదరాబాద్‌లోనే ఉన్నట్లయింది. ఇవి కాక సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం 40.17 చ.కి.మీ., 2,53,636 మంది ఓటర్లు, 3,72,844 మంది జనాభా హైదరాబాద్‌లోనే ఉంటున్నా ఇది రక్షణ శాఖ పరిధిలోని ప్రాంతం కావడంతో పరిపాలనలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యం ఉంటుంది. అందుకే ఈ వివరాలను కొత్త జీహెచ్ఎంసీలో కలపడంలేదు. మున్సిపల్ బాడీలు (కంటోన్మెంట్ మినహాయించి) జీహెచ్ఎంసీలో విలీనమైన తర్వాత లెక్కల్లో ఈ వివరాలను పరిశీలిస్తే….
ప్రస్తుత GHMC…
విస్తీర్ణం : 625 చ.కి.మీ.
జనాభా : 1,45,15,662
ఓటర్లు : 98,74,600
విలీనం తర్వాత :
విస్తీర్ణం : 1942.73 చ.కి.మీ.
జనాభా : 1,65,32,640
ఓటర్లు : 1,12,46,694
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం :
విస్తీర్ణం : 40.17 చ.కి.మీ.
జనాభా : 3,72,884
ఓటర్లు : 2,53,636
Read Also: నిట్టనిలువుగా చీలిన ఐఏఎస్‌లు?
Follow Us On: X(Twitter)


