కలం, నల్లగొండ బ్యూరో : హైవేలపై బస్సులే వారి టార్గెట్.. జాతీయ రహదారులు, దాబాల వద్ద ఆగిన బస్సులోని నగదుపైనే వారి కన్నంతా. చిన్న చితక చిల్లర పైసల్ వారికి ఏ మాత్రం అవసరం లేదు. కొడితే కుంభస్థలమే కొట్టాలి అన్నట్లుగా భారీగా బంగారమో, నగదునో దోచుకోవడం వారి స్టైల్. ఇంతకీ వారెవరో కాదు.. మధ్యప్రదేశ్ (Madhya Pradesh) కి చెందిన అంతర్రాష్ట్ర ధార్ గ్యాంగ్. మధ్యప్రదేశ్ ధార్ జిల్లాకు చెందిన ఓ ఐదుగురు పాత నేరస్తులు ముఠాగా (Dhar Gang) ఏర్పడ్డారు. హైవేల వెంట, దాబాల వద్ద ఆగిన బస్సులనే లక్ష్యంగా చేసుకొని బంగారం, నగదును పక్కా ప్లాన్ వేసి దోచుకోవడం వీరి ప్రత్యేకత. ఇలా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ ఎత్తున దోపిడీలకు పాల్పడ్డారు. ఈ క్రమంలోనే గత ఏడాది డిసెంబరు నెలలో చిట్యాల (Chityala) పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ బస్సులో భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను చోరీ చేశారు. ఈ ఘటన నల్లగొండ (Nalgonda) జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమయింది.
ఈ ఇష్యూని సవాలుగా తీసుకున్న నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ.. రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కేసును ఛేదించింది. ఈ రెండు ప్రత్యేక బృందాలు మధ్యప్రదేశ్ కు చేరుకొని 15 రోజులపాటు తీవ్రంగా శ్రమించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను మధ్యప్రదేశ్‌లోని మనవార్ (Manawar) పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తించారు. అక్కడి ఉమర్భాన్ క్రాస్ రోడ్డు వద్ద ఒక నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేయగా, అతడు తన సహచరులు అష్రఫ్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, జాబర్ ఖాన్, ఉమర్ ఖాన్‌లతో కలిసి దోపిడీలు చేసినట్టు అంగీకరించారు.
విచారణలో భాగంగా సదరు ముఠా (Dhar Gang) 2022, 2023 సంవత్సరంలో కూడా విజయవాడ హైవేతో పాటు ఇతర ప్రదేశాల్లో హోటల్స్ వద్ద ఆగి ఉన్న బస్సుల్లో నుంచి భారీ మొత్తంలో డబ్బు బంగారం దొంగిలించినట్టు తెలిపారు. సదరు నిందితుడిని మనవార్ న్యాయస్థానంలో హాజరు పరిచి ట్రాన్సిట్ వారెంట్ పై జిల్లాకు తీసుకు వచ్చారు. నిందితుడి వద్ద నుండి రూ.85 లక్షల విలువైన 60 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకొన్నారు. కేసును ఛేదించిన సిసిఎస్, ఇన్స్పెక్టర్ ఎం. జితేందర్ రెడ్డి, చిట్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు, సి.సి.ఎస్ ఎస్ఐ శివ కుమార్, సి.సి.ఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన గిరి, పుష్పగిరి తదితరులను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ప్రత్యేకంగా అభినందించి రివార్డును ప్రకటించారు.
Read Also: మెట్రో ఫేజ్ 2కు సహకరించండి: కేంద్రానికి భట్టి విజ్ఞప్తి
Follow Us On : WhatsApp


