కలం, వెబ్ డెస్క్: ఈ రోజుల్లో ఇన్‌స్టాగ్రామ్ వాడకం సర్వసాధారణం అయిపోయింది. స్కూల్ పిల్లల దగ్గరి నుంచి ముసలి వాళ్ల వరకు వయసుతో సంబంధం లేకుండా ఇన్‌స్టాగ్రామ్‌ను వాడుతున్నారు. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ అందుబాటులోకి వస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్ మ్యూస్ ఇమేజ్ పేరుతో కొత్త సౌకర్యం (Instagram AI Feature) అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ సౌకర్యంపై ప్రైవసీ ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అసలు మ్యూస్ ఇమేజ్ అంటే ఏమిటి? ప్రైవసీ ఆందోళనలు ఎందుకు వ్యక్తం అవుతున్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇన్‌స్టాగ్రామ్ మెటా తాజాగా మ్యూస్ ఇమేజ్ పేరుతో కొత్త AI ఇమేజస్ తయారీ సౌకర్యాన్ని జూలై 7వ తేదీన అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది ప్రస్తుతం మెటా AI సేవ, ఇన్‌స్టాగ్రామ్ కథనాలు, వాట్సాప్ సంభాషణల్లో అందుబాటులోకి రాగా.. త్వరలో ఫేస్ బుక్, మెసెంజర్‌ల్లోనూ అందుబాటులోకి రానుంది. ఈ సౌకర్యం ద్వారా మీకు తెలియకుండానే మీ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలను ఏఐ చిత్రాల కోసం ఉపయోగించవచ్చట.
అయితే, యూజర్స్ తమకు కావాల్సిన ఫోటోను మాటల్లో వివరిస్తాడు. ఏఐ దానికి తగ్గట్టుగా కొత్త ఫోటోను తయారు చేసి ఇస్తుంది. అంతే కాకుండా మూడు ఫోటోలను కలిపి ఒక చిత్రంగా మార్చడం, ఫోటోలోని ఒక భాగాన్ని మాత్రమే మార్చడం, అక్షరాలు యాడ్ చేయడం, వెంటనే రెస్పాన్స్ సిగ్నల్స్ రూపొందించడం వంటి పనులను కూడా ఏఐ చేయగలదు. తాజాగా ఈ సౌకర్యంపై ప్రైవసీ ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే?
సాధారణంగా ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ అందరికి కనిపిస్తుంది. ఈ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను సూచిస్తూ ఏఐకు ఎవరైనా ఆదేశం ఇస్తే, అప్పుడు ఆ ఖాతాలోని ఫోటోలను ఆధారంగా చేసుకుని ఆ వ్యక్తి ముఖాన్ని పోలిన కొత్త చిత్రాలను తయారు చేసే అవకాశం ఉంది. అయితే ఇలా ఇమేజ్ తయారు చేసేటప్పుడు ఏఐ ఆ వ్యక్తి అనుమతి కూడా తీసుకోదు. తమ ఫోటోలు ఇలా ఉపయోగించారనే సమాచారం కూడా వారికి ఇవ్వదు. అంటే మీకు తెలియకుండానే మీ ఫోటోల ఆధారంగా ఏఐ కొత్త చిత్రాలు తయారయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ సౌకర్యంపై ప్రైవసీ ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
అదృశ్య వాటర్ మార్క్
ఏఐతో రూపొందించిన ప్రతి చిత్రంలో కంటికి కనిపించని వాటర్ మార్క్ ఉంటుందని మెటా చెబుతోంది. దీని ద్వారా సదరు చిత్రం ఏఐతో తయారైందని సులభంగా గుర్తించవచ్చు. అయితే ఈ ఫీచర్ ద్వారా ఇప్పటికే ఒకసారి తయారైన ఏఐ చిత్రాలను తొలగించే వీలు ఉండదు. ఇతర వినియోగదారులు తమ ఏఐ క్రియేషన్స్ కోసం మీ ప్రొఫైల్ ఫోటోలను ఉపయోగించకుండా అడ్డుకునే వెసులు బాటు లేదు.
మీ ఫొటోలను ఉపయోగించకుండా ఎలా ఆపాలి?
అయితే భవిష్యత్తులో వేరేవారు మన ప్రొఫైల్ ఉపయోగించకుండా ఉండేందుకు ఈ సెట్టింగ్ చేసుకోవాలి. దీనికోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మీ ఖాతాను తెరవండి. కుడి వైపు ఉన్న మూడు గీతల గుర్తుపై నొక్కి పంచుకోవడం, మళ్లీ ఉపయోగించడం అనే విభాగంలోకి వెళ్లండి. మెటా ఏఐ కోసం మీ విషయాలను ఉపయోగించేందుకు అనుమతించడం అనే ఎంపికను తెరవండి. అక్కడ పోస్టులు, రీల్స్ రెండింటి అనుమతులను ఆఫ్ చేయండి. ఇలా చేస్తే, ఇకపై మీ కొత్త ఫొటోలను ఏఐ చిత్రాల తయారీకి ఆధారంగా ఉపయోగించరు.
అయితే ఈ మార్పు గతానికి వర్తించదు. మీరు అనుమతిని ఇప్పుడు నిలిపివేసినా.. ఇప్పటికే మీ ఫొటోలతో తయారైన AI చిత్రాలు అలాగే ఉంటాయి. మీ ఖాతాను తర్వాత వ్యక్తిగత ఖాతాగా మార్చినా, ఇప్పటికే తయారైన చిత్రాలపై దాని ప్రభావం ఉండదు. ఈ కొత్త ఆప్షన్ (Instagram AI Feature) ప్రస్తుతం అందరికీ కనిపించకపోవచ్చు. మెటా దీన్ని దశలవారీగా అందుబాటులోకి తీసుకొస్తోంది.
Read Also: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. ఎన్ని గంటలు నిద్రపోవాలి?
Follow Us On: Instagram

