కలం, వెబ్ డెస్క్: ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం. ఇది కేవలం విశ్రాంతిని ఇవ్వడమే కాకుండా మానసిక నియంత్రణ, శారీరక ఆరోగ్యానికి బూస్ట్ ఇస్తుంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి (Heart Health) నాణ్యమైన నిద్ర కీలకం. నిద్ర సమయంలో శరీరం తనను తాను పునరుద్ధరించుకుంటుంది. హార్మోన్లను నియంత్రించడం, వాపులను తగ్గించడం, గుండె పనితీరును మెరుగుపరిచే ప్రక్రియలు ఈ సమయంలోనే జరుగుతాయి. తగినంత నిద్ర లేకపోవడం వల్ల గుండె ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. తక్కువ నిద్ర కారణంగా ఊబకాయం, రక్తపోటు, మధుమేహం లాంటి గుండె జబ్బులు పెరుగుతాయని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA) పేర్కొంది.
సాధారణంగా రాత్రి నిద్రలో రక్తపోటు 10శాతం 20శాతం వరకు తగ్గి, గుండె వేగం మందగిస్తుంది. కానీ 7 గంటల కంటే తక్కువ నిద్రపోవడం వల్ల గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. సరైన నిద్ర లేకపోవడం వల్ల గుండెకు నష్టం కలిగించే అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. గాఢ నిద్ర కరువైనప్పుడు రాత్రంతా రక్తపోటు అధికంగానే ఉండిపోతుంది. ఇది గుండె జబ్బులకు ప్రధాన కారణం. నిద్రలేమి వల్ల ఒత్తిడి, ఆకలిని నియంత్రించే హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది శరీరంలో ఇన్సులిన్ నిరోధకత, బరువు పెరగడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు దారితీస్తుంది. వీటన్నింటితో పాటు, తక్కువ నిద్ర వల్ల శరీరంలో దీర్ఘకాలిక వాపులు పెరుగుతాయి. ఈ ప్రభావంతో గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాలు వస్తాయి.
గుండెను ఆరోగ్యంగా (Heart Health) ఉంచుకోవడానికి ప్రతిఒక్కరూ మంచి నిద్ర అలవాట్లను అలవర్చుకోవడం ముఖ్యం. ఇందుకోసం ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, నిద్ర లేవడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు. పడకగది చీకటిగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. నిద్రపోవడానికి కనీసం ఒక గంట ముందు స్క్రీన్ సమయాన్ని తగ్గించాలి. అలాగే కాఫీ, ఆల్కహాల్ కూడా దూరంగా ఉండాలి.
Read Also: దంపతులైనా సరే.. ఈ వస్తువులు మాత్రం అస్సలు పంచుకోవద్దు!
Follow Us On : WhatsApp

