కలం, వరంగల్ బ్యూరో : మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతర (Medaram Jatara) లో భక్తుల కోసం ప్రభుత్వం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది. దేవతల దర్శనం పూర్తయిన అనంతరం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఈసారి క్యూలైన్ల నిర్మాణం వినూత్నంగా చేపడుతున్నారు. పది నుంచి ఇరవై నిమిషాల వ్యవధిలోనే దర్శనం జరిగేలా రూ. 3 కోట్లతో క్యూలైన్ల నిర్మాణం చేపట్టారు. దాదాపుగా నిర్మాణ పనులు పూర్తయ్యాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో
ఇప్పటి వరకు జాతర (Medaram Jatara) గద్దెల ప్రాంగణానికి కుడి, ఎడమ, వెనక వైపు క్యూలైన్లు ఉండేవి. ఈసారి కుడి వైపు ఉన్న వరుసలను తొలగించి స్మృతివనం నిర్మిస్తున్నారు. ఎడమ వైపు ఉన్న వాటన్నింటిని తొలగించారు. మొత్తం ఐదు వరుసలను నిర్మిస్తున్నారు. ఈ వరుసల్లో ప్రవేశించిన భక్తులు సమారు 750 మీటర్లు నడిచి గద్దెల ప్రాంగణానికి చేరుకుంటారు. మధ్య వరుసను పోలీసులు, వాలంటీర్ల కోసం వినియోగించనున్నారు. దానికి కుడి వైపు ఉన్న రెండు, ఎడమ వైపు ఉన్న రెండు వరుసల్లో మాత్రమే భక్తులను అనుమతిస్తారు. వీటిపై నీడ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తరహాలో షెడ్లు నిర్మిస్తున్నారు. లైన్లలో వేచి ఉండే భక్తులు ఒత్తిడికి గురి కాకుండా ఉండేందుకు ఫ్యాన్లు, తాగునీటి సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. గతంలో భక్తులు ఒక వరుస నుంచి మరో వరుసలోకి వెళ్లేందుకు ఇనుప బొంగుల మధ్య కొంత స్థలం ఉండేది. ఈసారి అలాంటి అవకాశం లేకుండా ఏర్పాట్లు చేశారు.
వీఐపీల కోసం ప్రత్యేకం
దేశంలోని వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి గవర్నర్ లు, ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులతో పాటు రాష్ట్రానికి చెందిన వేలాది మంది ప్రముఖులు సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు జాతరకు వస్తారు. వీరందరికీ వీఐపీ (VIP) దర్శనం అందేలా చేయడం అధికారులకు సవాల్ గా మారుతోంది. గతంలో వీఐపీల కోసం ప్రత్యేకంగా ఒక వరుస ఉండగా పైరవీల కారణంగా వాటిని తొలగించారు. ఈ సారి మాత్రం మాస్టర్ ప్లాన్ లో ప్రత్యేకంగా వీఐపీ వరుసను పక్కాగా ఏర్పాటు చేస్తున్నారు.
సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఈ నెల 18న సాయంత్రం మేడారం వస్తున్నారు. తర్వాత రోజు ఉదయం పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. రూ.251 కోట్లతో జాతర ఏర్పాట్లు సమ్మక్క-సారలమ్మ గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం జరుగుతోందని, పనులు తుది దశలో ఉన్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె మీడియాకు వివరించారు.
Read Also: సీనియర్ జర్నలిస్టు ఫజల్ మృతి
Follow Us On : WhatsApp


