కలం, వెబ్ డెస్క్: ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ప్రధాన పాత్రలో నటించిన కల్ట్ వెబ్ సిరీస్ (Cult Web Series) విడుదలకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. మదనపల్లెలో సంచలనం సృష్టించిన చిన్నారుల హత్య ఉదంతాన్ని ఆధారంగా చేసుకుని, కల్పిత కథాంశంతో ఈ సిరీస్‌ను నిర్మించారంటూ ఉత్తమ్ వల్లూరి చౌదరి అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు విచారణలో ఉన్న తరుణంలో, ఇలాంటి సున్నితమైన అంశంపై వెబ్ సిరీస్ తీయడం, దానిని ఈ నెల 17న విడుదల చేయడానికి ప్రయత్నించడం ఏమాత్రం సమంజసం కాదని పిటిషనర్ తన వాదనలో పేర్కొన్నారు.
ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం దీనిపై స్పందిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి నటుడు రాహుల్ సిప్లిగంజ్, కల్ట్ వెబ్ సిరీస్ దర్శకుడు, చిత్ర బృందంతో పాటు గూగుల్, మెటా కార్పొరేషన్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. వాస్తవ ఘటనలను వక్రీకరిస్తూ నిర్మించిన ఈ సిరీస్ వల్ల కేసు విచారణపై ప్రభావం పడే అవకాశం ఉందన్న పిటిషనర్ ఆవేదనను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ నెల 17న విడుదల కావాల్సిన ఈ సిరీస్ భవితవ్యం ఇప్పుడు కోర్టు ఆదేశాలపై ఆధారపడి ఉండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Read Also: టికెట్ల రేట్లపై రాజాసాబ్ నిర్మాతలకు ఝలక్
Follow Us On: Sharechat


