కలం, వెబ్‌డెస్క్: ఇండిగో(Indigo) సంక్షోభం రైల్వేకు కాసుల వర్షం కురిపిస్తోంది. రైల్వే స్టేషన్లు, రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.స్లీపర్ బెర్త్‌లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.దీంతో రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. శబరిమలకు దక్షిణాది నుంచి దాదాపు ప్రత్యేక రైళ్లను నడుపుతున్న రైల్వే శాఖ ప్రస్తుత రద్దీతో మరికొన్ని రైళ్లను కేటాయించింది. దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే ప్రకటించిన 60 ప్రత్యేక రైళ్లకు తోడు మరో 10 రైళ్లను నడుపనున్నట్లు ప్రకటించింది. రెగ్యులర్ రైళ్లకు తోడు వందలాదిగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నప్పటికీ అవి సరిపోవడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.శబరిమల వెళ్లే యాత్రికుల సీజన్‌తో పాటు క్రిస్‌మస్ సెలవులు, సంక్రాంతి పండుగ కూడా ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లోనూ రైళ్లు కిటకిటలాడుతున్నాయి.పెళ్లిళ్లు, ముఖ్యమైన సమావేశాలు, కార్యక్రమాలు ఉండడంతో చాలా మంది ఎలాగైనా వాటికి హాజరు కావాలనే ఉద్దేశంతో రైళ్లలో నిలబడి సైతం ప్రయాణిస్తున్నారు.
కొనసాగుతున్న Indigo సంక్షోభం..
సాంకేతిక సమస్యలు, డీజీసీఏ కొత్త నిబంధనల కారణంగా ఇండిగోలో తలెత్తిన సంక్షోభం వరుసగా మూడో రోజైన శుక్రవారమూ కొనసాగుతోంది.దేశవ్యాప్తంగా మొదటి రోజు 250, రెండో రోజు 500కు పైగా సర్వీసులను రద్దు చేసిన ఇండిగో నేడు మరో 400కు పైగా సర్వీసులు రద్దు చేసింది. ఇందులో శంషాబాద్ విమానాశ్రయానికి సంబంధించి 92 సర్వీసులు ఉన్నాయి. ఇందులో దేశీయ సర్వీసులతోపాటు అంతర్జాతీయ సర్వీసులూ ఉన్నాయి. మొత్తంగా హైదరాబాద్‌కు రావాల్సిన సర్వీసులు 43, ఇక్కడి నుంచి వెళ్లాల్సినవి 49 సర్వీసులు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు విమానాశ్రయాల్లో పడిగాపులు పడుతున్నారు.ఏ విమానం వెళుతుందో, ఏది రద్దయిందో కూడా చెప్పడంలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెక్ ఇన్ అయిన తర్వాత గంటల తరబడి కూర్చోబెట్టి ఆ తర్వాత విషయం చెబుతున్నారని అంటున్నారు. తమకు కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వడం లేదని మండిపడుతున్నారు.కొందరు ప్రయాణికులు రెండు రోజుల నుంచి విమనాశ్రయాల్లోనే పడిగాపులు పడుతున్నారు.రిఫండ్ కూడా ఎప్పుడొస్తుందో తెలియడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. ‘నేను భువనేశ్వర్ నుంచి బెంగళూరుకు నెల కిందట టికెట్ బుక్ చేసుకున్నాను. ఈ రోజు వరకు షెడ్యూల్ చూపించింది. తీరా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాక క్యాన్సిల్ అన్నారు. రిఫండ్ వారంలో ఇస్తామన్నారు. కానీ, ఇప్పటికీ రిఫండ్ రాలేదని, చాలా మంది రిసీట్లతో ఎయిర్‌పోర్ట్‌కు రావడం నేను చూశాను‘ అని ఓ ఒడిశా ప్రయాణికుడు వాపోయాడు.మరోవైపు ఫిబ్రవరి 10 వరకు సమస్య పరిష్కారమవుతుందని ఇండిగో అంటోంది.
డీజీసీఏ వార్నింగ్..:
ఇండిగో సమస్య తీవ్రత డీజీసీఏకు, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు తాకింది. పార్లమెంట్ ఆవరణలో ఇండిగో సమస్యపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. రామ్మోహన్ నాయుడుని ప్రశ్నించారు. దీనిపై తన ‘ఎక్స్’ ఖాతాలోనూ రాహుల్ పోస్ట్ పెట్టారు. దీంతో రామ్మోహన్ నాయుడు ఆదేశాలతో డీజీసీఏ దిద్డుబాటు చర్యకు దిగింది. సమస్యను త్వరగా పరిష్కరించాలంటూ ఇండిగోకు వార్నింగ్ ఇచ్చింది.
Read Also: కేటీఆర్ కోసమే కేసీఆర్ బయటకు రావట్లేదా?
Follow Us On: Facebook


