కలం, వెబ్ డెస్క్: తిరువనంతపురంలో శ్రీలంకతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. శుక్రవారం ఇక్కడ గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన మూడో టీ20లో భారత్ (India) 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో సిరీస్‌లో 3-0 ఆధిక్యం సాధించి, రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది.
హర్మన్‌ప్రీత్ కౌర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా, భారత(India) బౌలర్లు అద్భుతంగా రాణించారు. పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ 4 వికెట్లతో (4/21) శ్రీలంక టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చింది. ఆల్‌రౌండర్ దీప్తి శర్మ 3 వికెట్లు (3/18) తీసి, మహిళల టీ20ల్లో అత్యధిక వికెట్లు (151) తీసిన బౌలర్లలో (ఆస్ట్రేలియా మెగాన్ షట్)తో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 112 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇమేషా దులాని (27), హసిని పెరీరా (25), కవిషా దిల్హారి (20) కొంత పోరాడారు కానీ మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.
113 పరుగుల లక్ష్యంతో దిగిన భారత(India) ఓపెనర్ షెఫాలీ వర్మ అదరగొట్టింది. 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన షెఫాలీ అజేయంగా 79 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చింది. జెమిమా రొడ్రిగ్స్ (9) త్వరగా అవుట్ అయినా, షెఫాలీ భారత్‌ను 13.2 ఓవర్లలోనే 115/2తో గెలిపించింది. ఈ సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లు విశాఖపట్నంలో జరిగాయి. మొదటి మ్యాచ్‌లో భారత్ 8 వికెట్లు, రెండో మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలిచింది. మిగిలిన మ్యాచ్‌లు డిసెంబర్ 28, 30తేదీల్లో ఇదే వేదికగా జరగనున్నాయి.
Read Also: యాషెస్‌లో ఒకేరోజు 20 వికెట్లు.. ఆసిస్ వర్సెస్ ఇంగ్లాండ్
Follow Us On: Youtube


