కలం, స్పోర్ట్స్: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో (T20 World Cup Final) భారత్ అద్భుత విజయం సాధించి చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్‌ను 159 పరుగులకే ఆలౌట్ చేసి తమ సత్తా చాటింది. ఈ మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింటిలో అదరగొట్టింది. బలమైన న్యూజిలాండ్ జట్టును 94 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా ఒకేసారి రెండు అరుదైన రికార్డులను బద్దలు కొట్టింది. టాస్ గెలిచిన జట్టే వరుసగా టైటిల్ గెలుస్తున్న ‘టాస్ సెంటిమెంట్’ను చెరిపేసింది. అలాగే ఆతిథ్య దేశం తన గడ్డపై ఛాంపియన్ కాలేదన్న రికార్డును కూడా భారత్ తుడిచిపెట్టింది.
ఫైనల్ మ్యాచ్‌లో కివీస్ కెప్టెన్ మిఛెల్ శాంట్నర్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. గతంలో 2010 నుంచి టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌లో టాస్ గెలిచిన జట్టే ట్రోఫీ ఎత్తిపడేసింది. ఈసారి కూడా అదే జరుగుతుందా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ భారత జట్టు ఆ సెంటిమెంట్‌ను పూర్తిగా చెరిపేసింది.
ఇక భారత సారథి సూర్యకుమార్ యాదవ్ మాత్రం రికార్డులు బ్రేక్ చేయాలనే లక్ష్యంతోనే జట్టు బరిలోకి దిగిందని తెలిపాడు. అదే ఆత్మవిశ్వాసం మైదానంలో కనిపించింది. భారత ఆటగాళ్లు ప్రతి దశలో ఆధిపత్యం చాటుతూ మ్యాచ్‌ను తమ వైపు తిప్పుకున్నారు. టీ20 ప్రపంచకప్ చరిత్ర చూస్తే 2007 నుంచి ఇప్పటి వరకు ఆతిథ్య దేశం తన గడ్డపై ఛాంపియన్ కాలేదు. 2012లో శ్రీలంక, 2016లో భారత్ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొన్నాయి. కానీ ఈసారి భారత్ ఆ సెంటిమెంట్‌ను చెరిపేసి కొత్త చరిత్ర రాసింది.
అదే సమయంలో మరో ప్రత్యేక రికార్డు కూడా నమోదైంది. టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup Final) చరిత్రలో ముందుగా బ్యాటింగ్ చేసి అత్యధికసార్లు టైటిల్ గెలిచిన జట్టుగా భారత్ నిలిచింది. తాజా విజయంతో ఆ సంఖ్య మూడు సార్లకు చేరింది. ఈ విజయంతో టీమిండియా కేవలం ట్రోఫీ గెలవడం మాత్రమే కాదు, ఎన్నాళ్లుగా కొనసాగుతున్న రెండు సెంటిమెంట్లను చెరిపేసి ప్రపంచ క్రికెట్‌లో మరో మైలురాయి సృష్టించింది.
Read Also: టీ20 వరల్డ్ కప్ 2026 ఛాంపియన్ టీమిండియా
Follow Us On: X(Twitter)

