కలం వెబ్ డెస్క్ : భారత్‌లోనే తొలి హైడ్రోజన్ రైలు (Hydrogen Train) పట్టాలపై పరుగులు పెట్టేందుకు సిద్దమైంది. హర్యానాలోని జింద్ -సోనీపత్ (Jind- Sonipat) మధ్య 90 కిలోమీటర్ల మార్గంలో ఈ రైలు నడవనుంది. హైడ్రోజన్ ఇంధనంతో నడిచే ఈ రైలు ట్రయల్ రన్ ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ట్రయల్ రన్ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఇండియన్ రైల్వే చేపట్టిన ఈ అత్యాధునిక పైలట్ ప్రాజెక్టు ఆత్మనిర్భర్ భారత్‌కు ప్రతిరూపంగా నిలుస్తుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.
ఈ రైలు తయారీ పూర్తయిందని, జింద్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ నుంచి ఇంధనం సరఫరా చేస్తారని ఆయన వెల్లడించారు. విద్యుద్విశ్లేషణ ప్రక్రియ ద్వారా ఇక్కడ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ప్లాంట్ దేశంలోనే అతి పెద్దదిగా చెబుతున్నారు.
హైడ్రోజన్ రైలు ప్రత్యేకతలు ఇవే
ఇండియన్ రైల్వే రూపొందించిన ఈ రైలు 10 కోచ్‌లతో ప్రపంచంలోనే అతి పొడవైన బ్రాడ్ గేజ్ హైడ్రోజన్ రైలుగా (Hydrogen Train) నిలుస్తుంది. దీనికి రెండు ఇంజిన్లు ఉంటాయి. ప్రతి ఒక్కటి 1200 కిలోవాట్ల సామర్థ్యంతో మొత్తం 2400 కిలోవాట్ల శక్తి కలిగి ఉంటాయి. ఇది గరిష్టంగా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీని నుంచి ఎలాంటి కార్బన్ ఉద్గారాలు విడుదల కావు. ఇది నీటి ఆవిరిని మాత్రమే విడుదల అవుతుంది. ఈ రైలులో ఒకేసారి 2500 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. ఈ రైలు పర్యావరణానికి హాని కలిగించకుండా, డీజిల్ ఆధారిత రైళ్లకు ప్రత్యామ్నాయంగా మారనుంది. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేసినందున ఖర్చులు గురించి పెద్దగా పట్టించుకోలేదని అధికారులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి రైళ్లు ఎక్కువగా వస్తే దేశ రవాణా రంగాన్ని కాలుష్యరహితంగా మారుస్తాయని అధికారులు భావిస్తున్నారు.
Read Also: ఢిల్లీలో కూల్చివేతలు.. తిరగబడ్డ స్థానికులు
Follow Us On: Sharechat


