కలం, వెబ్ డెస్క్: ఢిల్లీలో ఉద్రిక్తత చోటు చేసుకున్నది. పోలీసుల మీదకు ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులకు గాయాలయ్యాయి. కోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో సమీపంలో ఉన్న అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చేశారు (Delhi Demolition). స్థానికులు తిరగబడటంతో హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. కూల్చివేతలకు పాల్పడుతున్న అధికారులు, బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఢిల్లీలోని టర్క్‌మాన్ గేట్ సమీపంలోని సయ్యద్ ఫైజ్ ఎలాహీ మసీదు, ఖబరస్తాన్‌కు ఆనుకుని ఉన్న స్థలంలో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు కూల్చివేతలు చేపట్టారు.
తిరబడ్డ స్థానికులు
పోలీసులు మున్సిపల్ సిబ్బంది అక్కడికి చేరుకోగానే ఆందోళనకారులు రెచ్చిపోయారు. దీంతో పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసలు టియర్‌గ్యాస్ ప్రయోగించారు. నిరసనకారులను అక్కడి నుంచి చెదరగొట్టి ఓ పంక్షన్ హాల్ సహా ఇతర నిర్మాణాలను కూల్చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రాత్రివేళ ఈ చర్యలు చేపట్టినట్టు పోలీసు అధికారి నిధిన్ వాల్సన్ మీడియాకు తెలిపారు. ‘రాళ్లదాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది’’ అని ఆయన స్పష్టం చేశారు.
రంగంలోకి 17 బుల్డోజర్లు
అనధికార నిర్మాణాల తొలగింపునకు అధికారులు సుమారు 17 బుల్డోజర్లను రంగంలోకి దించారు. టర్క్‌మాన్ గేట్ సమీపంలోని రామ్‌లీలా గ్రౌండ్ వద్ద 38,940 చదరపు అడుగుల మేర ఉన్న ఆక్రమ నిర్మాణాలను కూల్చేయాలని (Delhi Demolition) 2025 నవంబర్‌లో ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల మేరకు ఎంసీడీ, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పీడబ్ల్యూడీ)లకు మూడు నెలల గడువు ఇచ్చింది. ఆ స్థలం తమదేనని మసీదు నిర్వహణ కమిటీ చెబుతుండగా.. ఆ భూమికి సంబంధించిన యాజమాన్య పత్రాలు ఏవీ తమకు అందించలేదని అధికారులు చెబుతున్నారు. 0.195 ఎకరాల భూమిలోనే మసీదు ఉంది. ఆక్రమణల్లో రహదారి భాగాలు, ఫుట్‌పాత్, ‘బరాత్ ఘర్’, పార్కింగ్ ప్రాంతం, ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్ ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. జనవరి 4న ఆక్రమిత ప్రాంతాన్ని గుర్తించేందుకు ఎంసీడీ అధికారులు వెళ్లగా, స్థానికుల నుంచి నిరసనలు ఎదురయ్యాయి. దీంతో పోలీసు బందోబస్తును పెంచారు.
Read Also: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలు.. పట్టాలెక్కేందుకు సిద్ధం!
Follow Us On : WhatsApp


