కలం, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేక అల్లర్లు, హిందువులపై దాడుల ప్రభావం ఆ దేశానికి అందించే సాయంపై పడింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఆదివారం కేంద్ర వార్షిక బడ్జెట్ 2026–27 (Union Budget 2026) ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. బడ్జెట్లో ‘ఎయిడ్ టు కంట్రీస్’ కింద పొరుగు దేశాలకు ఏటా భారత ప్రభుత్వం కొంత మొత్తం సాయం కింద ఇస్తుంది. ఇందులో ఈ ఏడాది బంగ్లాదేశ్‌కు రూ.60కోట్లను కేంద్రం ప్రకటించింది. గతేడాది రూ.120 కోట్లను కేటాయించగా, ఈసారి ఏకంగా సగానికి కోత పెట్టింది.
బంగ్లాదేశ్‌లో విద్యార్థుల ఆందోళనల కారణంగా పదవి కోల్పోయిన ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్‌లో తలదాచుకుంటోంది. ఈ క్రమంలో ఏడాదిన్నరగా బంగ్లాలో భారత వ్యతిరేక ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. హిందువులపై దాడులకు పాల్పడుతున్నారు. హత్యలు చేస్తున్నారు. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం ఈ దాడులను, హత్యలను పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో భారత్‌కు దూరమవుతూ, పాకిస్థాన్‌కు దగ్గరవుతున్న బంగ్లాదేశ్‌కు సాయంలో కోత విధించినట్లు భావిస్తున్నారు.
మరోవైపు ఈ ఏడాది బడ్జెట్ (Union Budget 2026) లో ‘ఎయిడ్ టు కంట్రీస్’కు కేటాయింపులు 4 శాతం పెరిగాయి. నిరుడు రూ.5,483 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.5,686కోట్లు ప్రకటించారు. ఇందులో భూటాన్ అన్నింటికంటే ఎక్కువగా రూ.2,289కోట్లు దక్కించుకుంది. ఇది గతేడాది కేటాయింపుతో పోలిస్తే 6శాతం అధికం. ఇక, నేపాల్‌కు రూ.880కోట్లు, శ్రీలంకకు రూ.60కోట్లు, మయన్మార్‌కు రూ.300కోట్లు, మాల్దీవులు, మారిషస్‌లకు చెరో రూ.550కోట్లు, ఆఫ్ఘనిస్థాన్‌కు రూ.150కోట్లు, మంగోలియాకు రూ.50కోట్లు, షీషెల్స్‌కు రూ.19కోట్లు, ఆఫ్రికన్ దేశాలకు రూ.225కోట్లు బడ్జెట్లో కేటాయించారు.
చాబహార్ పోర్ట్‌కు కేటాయింపులు లేవు!
కాగా, ఇరాన్‌లోని చాబహార్ పోర్టు (Chabahar Port) కు ఈసారి బడ్జెట్లో భారత్ నిధులు కేటాయించకపోవడం ఆసక్తి కలిగిస్తోంది. ఈ పోర్టును భవిష్యత్ అవసరాల దృష్ట్యా అభివృద్ధి చేసేందుకు భారత్.. ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. కొన్నేళ్లుగా నిధులు కేటాయింపు, పనులు జరుగుతున్నాయి. అయితే, ఈసారి బడ్జెట్లో చాబహార్‌కు నిధుల కేటాయింపు లేదు. అమెరికా, ఇరాన్ (Iran) మధ్య ఉద్రికత్తలు.. యుద్ధ ప్రమాదం ముంచుకొస్తుండడంతో భారత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Read Also: స్కూళ్లోనే రీల్స్ చేయడం నేర్పిస్తారా.. బడ్జెట్ లో ‘ఆరెంజ్ ఎకానమీ’ ఏంటి..?
Follow Us On : WhatsApp


