ముగ్గురు డకౌట్.. 89కే చాప చుట్టేసిన టీమిండియా!

క‌లం, స్పోర్ట్స్: ముగ్గురు స్టార్ బ్యాటర్లు డకౌట్.. మిగతా బ్యాటర్లదీ అదే బాట! 334 పరుగుల భారీ లక్ష్యం ముందు టీమిండియా (India) చేతులెత్తేసింది. న్యూజిలాండ్ (New Zealand)బౌలర్ మ్యాట్ హెన్రీ ధాటికి భారత బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. చివరకు 89 పరుగులకే ఆలౌటైన భారత్.. 244 పరుగుల తేడాతో చారిత్రక పరాజయాన్ని మూటగట్టుకుంది. గత 26 ఏళ్లలో వన్డేల్లో భారత్‌కు ఇదే అత్యంత భారీ ఓటమి. పరుగుల తేడా పరంగా భారత వన్డే చరిత్రలో ఇది రెండో అతిపెద్ద పరాజయం.

తొలి ఓవర్లోనే భారత్‌కు షాక్

భారత లక్ష్య ఛేదనను న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ దెబ్బతీశాడు. తొలి ఓవర్లోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్‌లను డకౌట్ చేశాడు. దీంతో భారత్ పరుగుల ఖాతా తెరవకముందే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దెబ్బ నుంచి భారత జట్టు కోలుకోలేకపోయింది. వరుసగా వికెట్లు పడటంతో లక్ష్య ఛేదన ఆరంభంలోనే ముగిసినట్టయింది. హెన్రీ 9.4 ఓవర్లలో కేవలం 27 పరుగులిచ్చి ఆరు వికెట్లు తీశాడు.

రెండు మెయిడిన్ ఓవర్లు వేశాడు. మాథ్యూ ఫిషర్ మూడు వికెట్లు పడగొట్టగా, కైల్ జేమీసన్ ఒక వికెట్ సాధించాడు. భారత బ్యాటర్లలో ఇషాన్ కిషన్ 27, అక్షర్ పటేల్ 21, నామన్ ధీర్ 21 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. దీంతో 26.4 ఓవర్లలోనే భారత ఇన్నింగ్స్ 89 పరుగుల వద్ద ముగిసింది.

యంగ్‌కు రెండు లైఫ్‌లు.. సెంచరీతో సమాధానం

అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 333 పరుగులకు ఆలౌటైంది. విల్ యంగ్ 125 పరుగులతో చెలరేగాడు. టిమ్ సీఫర్ట్ 58, ఫిన్ అలెన్ 41 పరుగులు చేశారు. మిచెల్ సాంట్నర్ 24, క్రిస్టియన్ క్లార్క్ 22 పరుగులు సాధించారు. అయితే యంగ్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే భారత్‌కు రెండు అవకాశాలు వచ్చాయి. రెండో ఓవర్లో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ వరుస బంతుల్లో అతడి క్యాచ్‌లు వదిలేశారు.

ఆ అవకాశాలను అందిపుచ్చుకున్న యంగ్ సెంచరీతో కివీస్‌కు భారీ స్కోరు అందించాడు. 2000 అక్టోబర్‌లో శ్రీలంక చేతిలో 245 పరుగుల తేడాతో ఓడిన తర్వాత.. భారత్‌కు వన్డేల్లో ఇదే అత్యంత భారీ పరాజయం. ఇప్పుడు న్యూజిలాండ్ చేతిలో 244 పరుగుల తేడాతో ఓడింది. అంటే 26 ఏళ్ల క్రితం నమోదైన చెత్త రికార్డుకు ఒక్క పరుగు దూరంలో నిలిచింది. న్యూజిలాండ్‌పై భారత్ నమోదు చేసిన రెండో అత్యల్ప వన్డే స్కోరు కూడా ఇదే.

Also Read : న్యూ లుక్‌లో కీర్తి సురేశ్..‘సత్యవాన్ సావిత్రి’ ట్రైలర్ రిలీజ్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>