పంట మార్పిడి, ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలి: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

కలం, నిర్మల్: పంటల సాగులో నీటి వినియోగాన్ని తగ్గించి, అధిక దిగుబడులు సాధించేలా సూక్ష్మ నీటిపారుదల పద్ధతులను (Micro Irrigation Methods) రైతులు అవలంబించేలా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా (Collector Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు హైదరాబాద్ నుంచి వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యవసాయం, విద్య, విబి-జీ రామ్ జీ, భూసేకరణ తదితర అంశాలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. రైతులు పంట మార్పిడి విధానాన్ని అనుసరించేలా చర్యలు తీసుకోవాలని, తక్కువ నీటితో సాగయ్యే పంటలకు ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. సూక్ష్మ సేద్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించి, ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందేలా చూడాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేయడంతో పాటు రైతుల వివరాల నమోదు పూర్తి చేయాలని, కొనుగోళ్లను కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సన్నధాన్యం సాగు చేసిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందేలా చూడాలన్నారు.

ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఎఫ్ఆర్ఎస్ హాజరు విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును ప్రతిరోజూ పర్యవేక్షించాలని సూచించారు. సమగ్ర శిక్షా అభియాన్, పీఎం శ్రీ పథకాల నిధులను పూర్తిస్థాయిలో వినియోగించాలని, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలు, తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. వీధి కుక్కల నియంత్రణకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో వాటిని గుర్తించి నిబంధనల ప్రకారం పునరావాస కేంద్రాలకు తరలించాలని తెలిపారు.

ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణాలకు అవసరమైన భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. విబి-జీ రామ్ జీ పథకం కింద నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యతనిస్తూ, జాబ్ కార్డులు కలిగిన ప్రతి ఒక్కరికీ పని కల్పించాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు వెంకట మాధవ రావు, రాథోడ్ రమేష్, డీఈఓ భోజన్న, డీపీఓ శ్రీనివాస్, సీపీఓ గంగారెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి రమణ, ఈఈ ఆర్‌డబ్ల్యూఎస్ సందీప్, నీటిపారుదల శాఖ అధికారులు రాజేంద్రప్రసాద్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>