భారత్ సమ్మిట్.. దేశ వ్యతిరేకుల కలయిక వేదిక: బండి సంజయ్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ అభివృద్ధి పేరుతో విదేశీ శక్తులతో కలిసి భారత్ సమ్మిట్ (Bharat Summit) నిర్వహించడం సిగ్గుచేటు అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay Kumar) మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్ దేశ వ్యతిరేకుల కలయిక వేదిక అని ఫైర్ అయ్యారు. భారత్ సమ్మిట్.. దేశ అభివృద్ధిని అడ్డుకునే సమ్మిట్ అని.. భారత్ లోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి విదేశీ శక్తులతో కలిసి చేస్తున్న కుట్రే భారత్ సమ్మిట్ అని విమర్శించారు. భారత్ సమ్మిట్ లో పాల్గొంటున్న 70 దేశాల ప్రతినిధుల్లో మెజారిటీ వ్యక్తులు ఇండియా విధానాలను వ్యతిరేకిస్తున్న వాళ్లేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

భారత్ సమ్మిట్ ఉద్దేశం ఏమిటి?

ఈ సమ్మిట్ నిర్వహణకు మొత్తం ఎంత ఖర్చు చేస్తున్నారు? ప్రభుత్వ ఖజానా నుంచి ఎంత వెచ్చిస్తున్నారు? అంటూ రాహుల్, రేవంత్ లను బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ సమావేశంలో చర్చించే అంశాలు భారత విదేశాంగ విధానానికి అనుగుణంగా ఉన్నాయా? అని నిలదీశారు. భారతదేశ అంతర్గత రాజకీయ వ్యవహారాలపై విదేశీ ప్రతినిధులతో చర్చించే అధికారం కాంగ్రెస్ కు ఎవరిచ్చారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ సమ్మిట్ ఉద్దేశం ఏమిటి? తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కరించడానికా? లేక ప్రపంచ దేశాలకు కాంగ్రెస్ రాజకీయ సిద్ధాంతాలను పరిచయం చేయడానికా? అంటూ నిప్పులు చెరిగారు.

సమ్మిట్ తో తెలంగాణ ప్రజలకు ఏం ప్రయోజనం?

భారత్ సమ్మిట్ తో తెలంగాణ ప్రజలకు ఏం ప్రయోజనం? అని కాంగ్రెస్ నేతలను బండి సంజయ్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ రాజకీయ ఆలోచనలకు అంతర్జాతీయ ప్రచారం కల్పించడానికేనా భారత్ సమ్మిట్ అంటూ నిలదీశారు. ప్రస్తుతం ఎల్ నినో ప్రభావంతో తెలంగాణలో రైతులు కరువుతో అల్లాడుతున్నారని.. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు డీఏలు, పీఆర్సీ, హెల్త్ కార్డులు లేక ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపై ఆశగా ఎదురు చూస్తున్నారని చెప్పారు.

శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా?

తెలంగాణ సమస్యలను, ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కనపెట్టి భారత్ సమ్మిట్ పేరుతో ప్రపంచ దేశాలతో రాజకీయ చర్చలు దుర్మార్గమని బండి సంజయ్ (Bandi Sanjay) ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత సమ్మిట్‌లో 44 అంశాలతో హైదరాబాద్ తీర్మానం చేశారు కదా…ఎన్ని అమలయ్యాయి? అని ప్రశ్నించారు. ఎన్ని దేశాలు ఆ తీర్మానాన్ని ఆచరణలోకి తీసుకున్నాయి?అని అడిగారు. “గతం సమ్మిట్ ద్వారా తెలంగాణలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి?ఎన్ని కొత్త పరిశ్రమలు వచ్చాయి? ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి? పెట్టుబడులపై ఎన్ని ఒప్పందాలు కుదిరాయి? వాటిలో ఎన్ని కార్యరూపం దాల్చాయి? గత సమ్మిట్ లో రూ.29.45 కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి ఏం సాధించారు? ఆ ప్రజాధనం ఎవరికి చెల్లించారు? ఎవరికి ఎంతెంత ఖర్చు చేశారు? గత సమ్మిట్ ఫలితాలపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా?” అంటూ బండి సంజయ్ నిలదీశారు.

Also Read : ఉగ్రవాదుల కోసం డ్రోన్లతో వేట.. భారీ పారితోషికం ప్రకటన!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>