కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : ఉమ్మడి మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లాలో బాల్య వివాహాలు (Child Marriages) ఆందోళనకర స్థాయిలో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా నారాయణపేట (Narayanpet) జిల్లాలో ఈ వివాహాలు అధికంగా జరుగుతున్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నిరక్షరాస్యత, అవగాహన లోపం కారణంగా చిన్నారుల భవిష్యత్తు వివాహ బంధంతో బందీ అవుతోంది. కేంద్ర గణాంకాల శాఖ 2019-21 సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 23.5 శాతం మేర బాల్య వివాహాలు కొనసాగుతున్నాయి. ఈ నివేదికలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నారాయణపేట జిల్లా బాల్య వివాహాలలో ముందంజలో ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రతి 100 మంది యువతులలో ఆరుగురికి 18 ఏళ్లు నిండక ముందే వివాహాలు జరుగుతున్నాయని వెల్లడైంది.
బాల్య వివాహాలు (Child Marriages) అధికంగా నమోదవుతున్న జిల్లాలలో నారాయణపేట మొదటి స్థానంలో ఉండగా, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాలు వరుసగా ఉన్నాయి. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలలో ఈ వివాహాలు ఎక్కువగా జరుగుతున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఎస్సీలలో 6.16 శాతం, నాగర్‌కర్నూల్‌లో 5.62 శాతం బాలికలకు మైనర్ వయసులోనే పెళ్లిళ్లు జరుగుతున్నాయి. జోగులాంబ గద్వాలలో 6.24 శాతం, వనపర్తిలో 5.78 శాతం, నారాయణపేటలో 6.27 శాతం ఎస్టీ వర్గాల్లో బాల్య వివాహాలు నమోదవుతున్నాయి.బీసీ వర్గాలలోనూ నారాయణపేట జిల్లాలో అత్యధికంగా 6.63 శాతం బాల్య వివాహాలు జరుగుతున్నట్లు నివేదిక తెలిపింది.
ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో “ఆడపిల్ల పెద్దదైతే వెంటనే పెళ్లి చేయాలి” అనే భావజాలం కొనసాగుతుండటం పరిస్థితిని మరింత దిగజారుస్తోంది. చిన్న వయసులో వివాహాలు జరగడం వల్ల బాలికలు చదువు మధ్యలోనే మానేయడం, ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడం, మానసిక ఒత్తిడికి గురికావడం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. బాల్య వివాహాల నిర్మూలన కోసం పోలీసులు, మహిళా సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖలు గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. ఈ సమస్యను అరికట్టాలంటే ప్రభుత్వ శాఖలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు సమిష్టిగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
Read Also: ఔటర్ రింగ్ రోడ్డుపై 200 కిమీ స్పీడ్.. యువకుడు అరెస్ట్
Read Also : దోషం.. దోపిడీ

