కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన గోదావరి జలాల సాధన దిశగా అడుగులు వేగవంతమయ్యాయి. సత్తుపల్లి మండలం యాతాలకుంట గ్రామంలో నిర్మాణంలో ఉన్న అత్యంత కీలకమైన యాతాలకుంట టన్నెల్ లైనింగ్ పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది ఆగస్టు 15లోపు పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) అధికారులను, కాంట్రాక్ట్ ఏజెన్సీలను ఆదేశించారు. సోమవారం మంత్రి తుమ్మల యాతాలకుంట టన్నెల్ ప్రాంతాన్ని సందర్శించి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు దివాకర్ టీఎస్, అంకిత్, అలాగే అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణలను వెంటబెట్టుకుని మంత్రి స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ టన్నెల్ లోపలికి వెళ్లి పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. జిల్లాకు గోదావరి జలాలు అందించడం ఇక్కడి ప్రజల చిరకాల స్వప్నమని అన్నారు. ఏటూరునాగారం నుంచి పాపికొండల వరకు గోదావరి పరివాహక ప్రాంతం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఆ జలాలను వినియోగించు కోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఖమ్మం సరిహద్దుల వరకు వచ్చినా సిల్ట్ సమస్యలు, ఇతర ప్రాంతాల ఆయకట్టు కారణంగా జిల్లాకు నీరు అందలేదని తెలిపారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ కొంత మేర ఉపశమనం ఇచ్చినా, ఖమ్మం జిల్లా ఎత్తైన ప్రాంతంలో ఉండటంతో గోదావరి జలాలను వినియోగించుకోవాలంటే లిఫ్ట్ ఇరిగేషన్ మాత్రమే ఏకైక మార్గమని స్పష్టం చేశారు.
గత చరిత్రను ప్రస్తావిస్తూ.. ఎన్టీఆర్ హయాం నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు ప్రతి ముఖ్యమంత్రిని ఖమ్మం జిల్లాకు లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేయాలని కోరుతూ పోరాడానని ఆయన గుర్తు చేసుకున్నారు. 2016లోనే 13 వేల కోట్ల పరిపాలనా అనుమతులు వచ్చినప్పటికీ గత ప్రభుత్వ హయాంలో పనులు చాలా నెమ్మదిగా సాగాయని మంత్రి విమర్శించారు. ఇటీవల భద్రాచలం పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తీసుకువచ్చి పెండింగ్ పనులను ప్రారంభించామని తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై రూ.10 వేల కోట్లు ఖర్చు చేశామని, మరో 7 నుంచి 8 వేల కోట్లు వెచ్చిస్తే కాలువల పనులు పూర్తి చేసి ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావచ్చని పేర్కొన్నారు.
పది లక్షల ఎకరాలకు సాగునీరు!
రాజీవ్ లింక్ కాలువను ఆరు నెలల్లో పూర్తి చేశామని, వచ్చే జూన్ నాటికి గోదావరి జలాలతో వైరా ప్రాజెక్టును నింపి లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందిస్తామని మంత్రి తుమ్మల ధీమా వ్యక్తం చేశారు. వచ్చే వర్షాకాలానికే ఈ టన్నెల్ ద్వారా గోదావరి జలాలు బేతుపల్లి చెరువుకు చేరాలనేదే తన కోరికన్నారు. ఇప్పటికే జూలూరుపాడు టన్నెల్ టెండర్ ప్రక్రియ పూర్తయ్యిందని, యాతాలకుంట లైనింగ్ పూర్తి కాగానే ఆ పనులు వేగవంతం అవుతాయని చెప్పారు. ప్రధాన కాలువ భూసేకరణ పూర్తి చేసిన కలెక్టర్లను మంత్రి అభినందిస్తూనే, డిస్ట్రిబ్యూటరీ కాలువల కోసం ఇంకా 11 వేల ఎకరాల భూమి అవసరమని, దీనిపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వసుంధర, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో రైతులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Read Also: ఉమ్మడి మహబూబ్నగర్లో పెరుగుతున్న బాల్య వివాహాలు
Read Also: తెలంగాణ టూరిజం సమ్మర్లో చుట్టేద్దాం

