కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై (Hyderabad ORR) ఓ యువకుడు చేసిన ప్రమాదకర డ్రైవింగ్ తీవ్ర కలకలం రేపింది. ఇతర వాహనదారుల ప్రాణాలను సైతం ప్రమాదంలోకి నెట్టేలా గంటకు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో కారు నడిపి భయాందోళనలు సృష్టించాడు. అంతేకాకుండా ఈ మొత్తం ఘటనను వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం, కొత్తపల్లి యశ్వంత్‌రెడ్డి అనే వ్యక్తి తన వోక్స్‌వ్యాగన్ కారుతో నార్సింగి టోల్ ప్లాజా నుంచి పోలీస్ అకాడమీ టోల్ ప్లాజా వరకు అత్యంత వేగంగా, ప్రమాదకరంగా డ్రైవింగ్ చేశాడు. వేగంతో పాటు రహదారిపై విన్యాసాలు చేస్తూ ఇతర వాహనాలను ఓవర్‌టేక్ చేయడం వంటి చర్యలకు పాల్పడ్డాడు.
యశ్వంత్‌రెడ్డి డ్రైవింగ్ కారణంగా అదే సమయంలో ఔటర్ రింగ్ రోడ్డుపై (Hyderabad ORR) ప్రయాణిస్తున్న పలువురు వాహనదారులు తీవ్ర భయానికి గురయ్యారు. అతడి కారు వేగం గంటకు 200 కిలోమీటర్లను దాటినట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోను గుర్తించిన నార్సింగి పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. వాహన వివరాల ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ప్రమాదకర డ్రైవింగ్, ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించడం తదితర సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రజా రహదారులపై ఇలాంటి స్టంట్‌లు, అత్యంత వేగంతో డ్రైవింగ్ చేయడం చట్ట విరుద్ధమని, ఇటువంటి చర్యలపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
Read Also: మోదీ ప్రభుత్వానికి దూరదృష్టి లోపించింది : మల్లికార్జున ఖర్గె
Read Also : దోషం.. దోపిడీ

