మంజీరా నదిలో ఇసుక దోపిడీ మళ్లీ జోరు

కలం, నిజామాబాద్ బ్యూరో : తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని మంజీరా నది (Manjira River) లో అక్రమ ఇసుక తవ్వకాలు(Illegal Sand Mining) మళ్లీ జోరందుకున్నాయి. మహారాష్ట్రలో ఇసుక క్వారీలు దక్కించుకున్న నిర్వాహకులు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దున ఉన్న మంజీరా నదిలోని తెలంగాణ భూభాగంలో ఇసుక తవ్వకాలు చేస్తూ.. మహారాష్ట్ర ఖజానాను నింపుతున్నారు. వేసవి కాలంలో నదిలో నీటి ప్రవాహం తగ్గిన వెంటనే ప్రతి ఏడాది ఇదే పరిస్థితి నెలకొంటోంది. నాందేడ్ జిల్లా బిలోలి తాలూకా పరిధిలోని బోలేగాం, ఏస్గీ, గంజ్‌గాం ప్రాంతాలలో క్వారీలు దక్కించుకున్న నిర్వాహకులు మహారాష్ట్రలో అనుమతులు పొందినప్పటికీ తవ్వకాలు మాత్రం తెలంగాణ భూభాగంలో కొనసాగిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

రెండు నెలల క్రితం సాలూర మండలం తగ్గెల్లి సమీపంలో ఇలాంటి తవ్వకాలు గుర్తించిన గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేయగా, రెవెన్యూ అధికారులు నదిలో హద్దులు గుర్తించి రాళ్లు పాతారు. అయితే కొద్ది రోజులకే వాటిని తొలగించి మళ్లీ తవ్వకాలు చేస్తున్నారు. పగలు మహారాష్ట్ర వైపున, రాత్రి తెలంగాణ వైపున తవ్వకాలు కొనసాగుతున్నాయి. తాజాగా హున్సా సమీపంలో బోలేగాం క్వారీ నిర్వాహకులు తెలంగాణ ప్రాంతంలో తవ్వకాలు చేస్తున్నట్లు రైతులు గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. దీంతో సాలూర తహసీల్దార్ అజ్మిత్ నవాజ్, సర్వేయర్ శ్రావణ్, ఆర్ఐ ఆనంద్, బోధన్ గ్రామీణ సీఐ విజయ్ బాబు సిబ్బందితో కలిసి నదిలో పరిశీలన చేపట్టారు. క్వారీ అనుమతుల పత్రాలు చూపాలని కోరినా నిర్వాహకులు నిరాకరించినట్లు తెలిసింది.

సంయుక్త సర్వే చేపట్టే వరకు తెలంగాణ భూభాగంలో తవ్వకాలు చేపట్టవద్దని అధికారులు ఆదేశించారు. హున్సా పరిసరాలలో అక్రమ ఇసుక తవ్వకాలకు అనుమతి లేదని తహసీల్దార్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, మహారాష్ట్ర క్వారీలను దక్కించుకున్న వారిలో నిజామాబాద్ జిల్లాకు చెందిన కొందరు నాయకులు ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో అక్రమ తవ్వకాలు నిర్భయంగా కొనసాగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్రాష్ట్ర ఒప్పందాలను అతిక్రమిస్తూ మంజీరా నదిలో ఇసుక దోపిడీ కొనసాగుతోందని, దీనిపై రాష్ట్ర స్థాయి మైనింగ్ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటేనే పరిస్థితి అదుపులోకి వస్తుందని అభిప్రాయపడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>