కలం, కరీంనగర్ బ్యూరో: రాష్ట్రంలో మెడికల్ షాపులు నిబంధనలను (Illegal Medical Shops) తుంగలో తొక్కుతున్నాయి. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన మందుల షాపులు కాసుల కక్కుర్తితో మృత్యువును విక్రయిస్తున్నాయి. డాక్టర్ల సిఫార్సు లేకుండానే ప్రాణాంతక మందులను విక్రయిస్తూ ప్రజారోగ్యంతో ఆడుకుంటున్న వైనం ఇప్పుడు కలకలం రేపుతోంది. మెడికల్ షాపులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. అర్హత గల ఫార్మసిస్టులు లేకపోయినా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకపోయినా యధేచ్ఛగా మందుల విక్రయాలు సాగుతున్నాయి. బాధ్యత గల డ్రగ్ కంట్రోల్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం.. ఒక మెడికల్ షాపులో కచ్చితంగా అర్హత కలిగిన ఫార్మసిస్ట్ ఉండాలి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. చాలా చోట్ల ఫార్మసీ చదివిన వారికి నెలకు రూ.15 నుంచి రూ.50 వేల వరకు చెల్లించి వారి సర్టిఫికెట్లను అద్దెకు తీసుకుంటున్నారు.
అసలు మందుల గురించి అవగాహన లేని వ్యక్తులతోనే ఈ వ్యాపారం సాగుతోంది. కేవలం ఓవర్ ది కౌంటర్ (OTC) మందులు మాత్రమే నేరుగా అమ్మాలి. కానీ డాక్టర్ల చీటీ లేకుండానే శక్తివంతమైన యాంటీబయాటిక్స్ విక్రయిస్తున్నారు. దీనివల్ల ప్రజల్లో రోగ నిరోధక శక్తి తగ్గిపోయి తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. అత్యంత ప్రమాదకరమైన గర్భ నిరోధక, గర్భ విచ్ఛిన్న మాత్రలను ఎటువంటి డాక్టర్ సిఫార్సు లేకుండానే విక్రయిస్తున్నారు. ఇది మహిళల ప్రాణాలకే ముప్పుగా మారుతోంది. ప్రాణాధార మందులు, టీకాలను రిఫ్రిజిరేటర్లలో భద్రపరచాలి. కానీ చాలా షాపుల్లో కనీసం విద్యుత్ సౌకర్యం కూడా లేకపోవడంతో మందుల నాణ్యత దెబ్బతింటోంది.
అధికారుల నిర్లక్ష్యం..
ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మెడికల్ షాపుల సంఖ్య పెరుగుతున్నా, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల తనిఖీలు మాత్రం నామమాత్రంగానే సాగుతున్నాయి. నెలకో, రెండు నెలలకో ఒకసారి షాపులను సందర్శిస్తున్న అధికారులు, కేవలం మొక్కుబడి తనిఖీలతో సరిపెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి మెడికల్ షాపులపై డ్రగ్ కంట్రోల్ శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మెడికల్ షాపుల్లో మందుల పట్ల కనీస అవగాహన లేని వ్యక్తులతో విక్రయాలు జరుపుతున్నారు. ఇది ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే.. డాక్టర్ల సిఫార్సు లేకుండానే అబార్షన్ మాత్రలను విక్రయించడం. పల్లెల్లో ఆర్‌ఎంపీల అండతో ఈ దందా జోరుగా సాగుతోంది. దీనివల్ల మహిళల ప్రాణాలకే ముప్పు వాటిల్లుతోంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2500 పైగా మెడికల్ షాపులు ఉన్నప్పటికీ, అధికారులు మాత్రం నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారు. నెలకు ఒకటి రెండు చోట్ల దాడులు చేసి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. తనిఖీలు లేకపోవడం, అధికారుల పర్యవేక్షణ లోపించడం వల్లే ఈ మెడికల్ మాఫియా రెచ్చిపోతోందని స్పష్టమవుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
పూర్తిస్థాయిలో రోగ నిర్దారణ జరగకుండానే కొన్ని సందర్బాలలో డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా యాంటీబయోటిక్స్ వాడటంతో ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తున్నాయి. పప్పు బెల్లంలా మందుల షాపుల్లో యాంటీబయాటిక్స్ వాడడం పట్ల మరిన్ని విమర్శలు వస్తున్నాయి. డ్రగ్ ఇన్స్పెక్టర్లు నిర్లిప్లతగా వ్యవహరించడం వల్ల మందులు విపరీతంగా విక్రయాలు జరుగుతున్నాయి. కనీసం నెలలో రెండు మూడు మార్లు తనిఖీలు చేసిన దాఖలాలు ఎక్కడా ఉమ్మడి జిల్లాలో కనిపించడం లేదు. ఇప్పటికైనా ఔషద నియంత్రణ అధికారులు మెడి‘కిల్’ దందాపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులను సంప్రదిస్తే సరైన సమాధానం ఇవ్వకుండా దాటవేస్తున్నారు. కనీసం ఫోన్లు సైతం ఆన్సర్ చేయడంపై కూడా స్పందించడం లేదు.
Read Also: ఫస్ట్ ఇంప్రెషన్‌ను పాడుచేసే అలవాట్లు ఏంటో తెలుసా?
Follow Us On: Sharechat

