కలం, ఖమ్మం బ్యూరో: అకాల వర్షాల కారణంగా ఖమ్మం జిల్లాలో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక మంత్రులు పూర్తిగా విఫలమయ్యారని మెదక్ ఎంపీ కె. రఘునందన్ రావు (Raghunandan Rao) తీవ్రంగా విమర్శించారు. ఖమ్మం (Khammam) నగరంలోని రెస్ట్ ఇన్ హోటల్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జిల్లాకు ముగ్గురు కీలక మంత్రులు ఉన్నా రైతుల సమస్యలను పట్టించుకునే నాథుడే లేడని ఆయన ఆరోపించారు. కొనుగోలు కేంద్రాలలో రైతులను దోచుకుంటున్నారని, గన్నీ బ్యాగులు, ట్రిప్ షీట్లు, లారీ ఏర్పాట్లు వంటి వాటికి కూడా రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శించారు.
రైతులు వర్షాలకు తడిసిన ధాన్యంతో తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఆయన అన్నారు. 48 గంటలలోగా ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం దేశ రాజకీయాలపై మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉందని, త్వరలో తెలంగాణలోనూ కాషాయ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
పశ్చిమ బెంగాల్‌లో అరాచక పాలనకు వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతోందని, అక్కడ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. అసోం, పుదుచ్చేరి వంటి రాష్ట్రాల్లో బీజేపీ విజయాలను ప్రస్తావించారు. రాబోయే రోజులలో తమిళనాడు, కేరళలోనూ బీజేపీ బలపడుతుందని పేర్కొన్నారు. పార్లమెంటులో కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే వంటి పార్టీలు వ్యవహరిస్తున్న తీరును ఎంపీ తీవ్రంగా తప్పుబట్టారు. మోదీ ప్రభుత్వం చారిత్రాత్మకంగా తీసుకువచ్చిన రాజ్యాంగంలోని 131వ సవరణ (మహిళా రిజర్వేషన్ బిల్లు), డీలిమిటేషన్ బిల్లులను ప్రతిపక్షాలు కావాలనే అడ్డుకునే కుట్ర చేశాయని అన్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ.. కీలకమైన దేశ సమస్యలపై మాట్లాడకుండా, మైకుల వద్ద అమర్యాదగా ప్రవర్తించడం ఆయన అపరిపక్వతకు నిదర్శనమని విమర్శించారు.
చివరగా మే 10న సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే మోదీ బహిరంగ సభకు భారీగా తరలిరావాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సన్నీ ఉదయ ప్రతాప్ , వాకధాని పుల్లారావు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

