కలం, నకిరేకల్: నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో చట్టవిరుద్ధంగా గర్భస్థ పిండ లింగ నిర్ధారణ (Fetal Sex Determination) పరీక్షలు నిర్వహిస్తున్న ఒక పెద్ద నెట్‌వర్క్‌ను నకిరేకల్ పోలీసులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సంయుక్తంగా దాడి చేసి చేధించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. దీనికి సంబంధించిన వివరాలను నకిరేకల్ పోలీస్ ఇన్స్పెక్టర్ వై. హరిబాబు వెల్లడించారు. జిల్లా వైద్యులకు అందిన సమాచారం మేరకు నకిరేకల్ పట్టణంలోని శివాజీ నగర్ ప్రాంతంలో ఉన్న ఒక ఇంట్లో అర్ధరాత్రి సమయంలో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఆ ఇల్లే కేంద్రంగా అక్రమంగా గర్భస్థ శిశువు లింగ నిర్ధారణకు ఉపయోగిస్తున్న పోర్టబుల్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రాన్ని గుర్తించారు. అక్కడున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దాడిలో రూ. లక్షల విలువైన డిజిటల్ అల్ట్రాసౌండ్ ఇమేజింగ్ సిస్టమ్‌తో పాటు దానికి సంబంధించిన ప్రోబ్, పవర్ కార్డ్, అల్ట్రాసౌండ్ జెల్ తదితర పరికరాలను అధికారులు పంచనామా నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ దందాకు సంబంధించి పోలీసులు ఐదుగురిని నిందితులుగా గుర్తించారు.
అందులో ముగ్గురిని అరెస్ట్ చేయగా, ఇద్దరు పరారీలో ఉన్నారు. అరెస్ట్ అయిన వారిలో నకిరేకల్ పట్టణంలోని శివాజీనగర్ కుచెందిన బాతుక యాదగిరి (47)(ఇతడిపై గతంలో కూడా రెండు కేసుల్లో నిందితుడు), జాల జానయ్య (53)టేకుమట్ల గ్రామం, సూర్యాపేట మండలం (ఈయన కూడా గతంలో రెండు కేసుల్లో నిందితుడు), జీలుగుల భరత్ (36) కేసారం గ్రామం, సూర్యాపేట మండలం ఉండగా, పరారీలో సోలిపేట గ్రామానికి చెందిన వల్లపు ప్రశాంత్, కత్తి కనకాల రెడ్డి ఉన్నారు.
దర్యాప్తులో షాకింగ్ నిజాలు..
పోలీసుల ప్రాథమిక విచారణలో ప్రధాన నిందితుడైన బాతుక యాదగిరి వృత్తిరీత్యా ఆర్ఎంపీగా పనిచేస్తూ, పలువురు మధ్యవర్తుల సహకారంతో గర్భిణీ స్త్రీలను గుర్తించి రహస్యంగా ఈ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తేలింది. వివిధ ప్రాంతాలకు చెందిన కొందరు ఆర్ఎంపీలతో కలిసి ఒక పెద్ద నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకొని, గర్భిణీ స్త్రీలను తన వద్దకు తీసుకురావడం, పరీక్షలు చేయడం, అందుకోసం భారీగా డబ్బులు వసూలు చేయడం వంటి పనులను పద్ధతి ప్రకారం నిర్వహిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.
ప్రధాన నిందితుడు యాదగిరి, జాల జానయ్యలు గతంలో కూడా ఇదే తరహా కేసుల్లో అరెస్ట్ అయి జైలుకు వెళ్లినప్పటికీ, విడుదలైన అనంతరం తిరిగి అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రాలను సమకూర్చుకుని అదే చట్టవిరుద్ధ కార్యకలాపాలను కొనసాగించడం గమనార్హం. ఈ సందర్భంగా డిఎస్పీ శివరాంరెడ్డి మాట్లాడుతూ గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా తీవ్రమైన నేరమని, ఇది మహిళల హక్కులకు, సమాజ నైతిక విలువలకూ విరుద్ధమని స్పష్టం చేశారు.
చట్టాన్ని ఉల్లంఘిస్తూ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే వారు, మధ్యవర్తులుగా వ్యవహరించే వారు, వారికి సహకరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాల గురించి సమాచారం తెలిసిన వెంటనే ప్రజలు పోలీసులకు లేదా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు తెలియజేయాలని కోరారు. ఈ కేసును ఛేదించిన సిఐ నకిరేకల్, సిఐ టాస్క్ ఫోర్స్, సిబ్బంది, ఎస్ఐ.వీరబాబు, ఎస్ఐ.కృష్ణ, సిబ్బంది జనార్ధన్, నాగరాజు, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, శ్రీకాంత్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.

