కలం, వెబ్ డెస్క్: ఒడిశాలోని బౌధ్ జిల్లా అడవుల్లో ఉన్న గిరిజన గ్రామం లెకడ్‌పాజు (Lalgarh) ఒకప్పుడు మావోయిస్టుల కోటగా గుర్తింపు పొందింది. ఎప్పుడు చూసినా తుపాకుల మోతలు, భద్రతా దళాలు బస్తీతో భయభయంగా ఉండేది. మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులతో ఇక్కడి ప్రజలు భయాందోళనల మధ్య గడిపేవారు. అయితే, ప్రస్తుతం అక్కడ తుపాకుల మోతలు ఆగిపోయాయి. తిరుగుబాటు నీడలు తొలగిపోయాయి. గ్రామానికి రహదారి సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చింది. కానీ శాంతి వైపు అడుగులేసిన ఆ గ్రామానికి ఇప్పుడు కొత్త కష్టం వచ్చిపడింది.
ఈ గ్రామంలో (Lalgarh) నివసిస్తున్న సుమారు 50 గిరిజన కుటుంబాలకు ఉనికి చాటుకోవడమే పెద్ద సవాలుగా మారింది. తుపాకీ గుండ్ల భయం పోయినా, సురక్షితమైన తాగునీరు దొరక్కపోవడమే సమస్యగా (Water Problem) మారింది. ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే గ్రామ మహిళలు కుండలు, బిందెలు పట్టుకుని గ్రామం బయట ఉన్న వాగు వైపు పరుగులు తీస్తారు. ఆ వాగులోని నీరు బురదగా, తాగడానికి వీల్లేకుండా ఉంటుంది. దీంతో స్వచ్ఛమైన నీటి కోసం గ్రామస్థులు వాగు ఇసుక తిన్నెలపై చిన్న చిన్న గుంతలు తవ్వి, అందులోకి భూగర్భ జలాలు ఊరే వరకు గంటల తరబడి ఓపికగా వేచి చూస్తారు.
ఆ గుంతల నుండి నీరు చాలా నెమ్మదిగా ఊరుతుండటంతో మహిళలు క్యూలైన్లలో గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. వేసవి, వర్షాకాలం అనే తేడా లేకుండా ఏడాది పొడవునా ఇదే దుస్థితి నెలకొంది. మావోయిస్టుల ప్రభావం తగ్గిన తర్వాత ప్రభుత్వం గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించింది. లక్షల రూపాయల వ్యయంతో సోలార్ ఆధారిత తాగునీటి ప్రాజెక్టును కూడా ఏర్పాటు చేసింది. కానీ, సరైన నిర్వహణ లేకపోవడంతో ఆ ప్రాజెక్టు నెలల తరబడి నిరుపయోగంగా పడి ఉంది. ఫలితంగా వసతులు మెరుగవుతాయని ఆశించిన గిరిజనులకు నిరాశే మిగిలింది, మళ్లీ పాత పద్ధతిలోనే బురద నీటి గుంతలపై ఆధారపడక తప్పడం లేదు. పాలకులు, ప్రభుత్వాధికారులు స్పందించి తమ దాహార్తీని తీర్చాలని కోరుకుంటున్నారు.
Read Also: 35 దాటిన మహిళల్లో ఇన్ఫెర్టిలిటీ ముప్పు.. కారణాలివే!
Follow Us On: X(Twitter)

