Mobile Popup Ad
Mobile Popup Ad

పేదల ఆత్మగౌరవానికి చిహ్నం ఇందిరమ్మ ఇండ్లు : మంత్రి పొంగులేటి

కలం, జోగులాంబ గద్వాల : పేదవాళ్ల ఆత్మగౌరవానికి చిహ్నంగా ఇందిరమ్మ ఇండ్లు నిలుస్తాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం ర్యాలంపాడు పునరావాస గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల శిలాఫలకాన్ని ఆవిష్కరించిన మంత్రి పలువురు లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి రిబ్బన్ కట్ చేసి ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు.

అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి ప్రసంగిస్తూ.. పాలమూరు బిడ్డే మన ముఖ్యమంత్రి కావడం గర్వకారణమన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సంక్షేమ పథకాలను అర్హులందరికీ అమలు చేస్తున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా కొత్త కార్యక్రమాలను కూడా అమలు చేసి ప్రజలకు చేరువ అయిందన్నారు. మొదటి విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేశామన్నారు.

రెండో విడతలోనూ అర్హులైన వారందరికీ ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం రూ.5 లక్షల సాయం అందజేస్తుందన్నారు. మూడు, నాలుగు విడతల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. ఇటీవల కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసి వారి ఖాతాల్లో వారం రోజుల్లోనే డబ్బులు జమ చేసినట్లు తెలిపారు.

ముంపు గ్రామాల ప్రజలు దేవుళ్లతో సమానం : వాకిటి శ్రీహరి

ముంపు గ్రామాల ప్రజలు దేవుళ్లతో సమానమని, వారి త్యాగం వెలకట్టలేనిదని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. పునరావాస కేంద్రాల్లో నిర్వాసితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. పార్టీలకు, వర్గాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి, నిర్మించుకునేందుకు సహకారం అందిస్తున్నామన్నారు. గుడిసెలు, పెంకుటిల్లు ఉన్న వారికి కూడా పక్కా గృహాలు నిర్మించుకునేందుకు ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని వర్తింపజేయనున్నట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు, డిసిసి అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి, గద్వాల మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంతు, గద్వాల మున్సిపల్ చైర్‌పర్సన్ తుమ్మల జయలక్ష్మి, గ్రామ సర్పంచి వెంకటరామిరెడ్డి, అదనపు కలెక్టర్లు మధు మోహన్, నర్సింగరావు, ఆర్డీవో శ్రీనివాసరావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు మనోజ్ కుమార్ రెడ్డి, రాజ్ కుమార్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, నేతలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>