కలం, నిజామాబాద్ బ్యూరో: రైతులకు అవసరమైన యూరియా ఎరువుల పంపిణీని మరింత సులభతరం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి (Nizamabad Collector Ila Tripathi) తెలిపారు. మీసేవ (MeeSeva) కేంద్రాల ద్వారా కూడా యూరియా స్లాట్ బుకింగ్ (Urea Booking)కు అవకాశం కల్పించిందని సూచించారు. అన్ని మీ సేవ కేంద్రాల్లో యూరియా స్లాట్ బుకింగ్ విధానం అందుబాటులోకి వచ్చిందని వెల్లడించారు.
స్మార్ట్‌ఫోన్ లేని రైతులు, స్వయంగా ఆన్‌లైన్‌లో స్లాట్ బుకింగ్ చేసుకోలేని రైతులు తమ సమీపంలోని మీసేవ కేంద్రాన్ని సందర్శించి యూరియా స్లాట్‌ను సులభంగా బుక్ చేసుకోవచ్చన్నారు. స్మార్ట్‌ఫోన్ సౌకర్యం లేని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సకాలంలో తమ అవసరాలకు సరిపడా యూరియా ఎరువులు పొందాలని కలెక్టర్ సూచించారు. ఈ విషయమై రైతులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.

