కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలోని గ్రామాల్లో మహిళా సంఘాల బలోపేతం నుంచి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వరకు ప్రతి పనిని ముందుండి నడిపిస్తున్న తమకు ప్రభుత్వం కనీస గుర్తింపు కూడా ఇవ్వడం లేదంటూ ఐకేపీ, వీఓఏలు (గ్రామ సంఘాల సహాయకులు) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ఐకేపీ వీఓఏల జేఏసీ ఆధ్వర్యంలో పాల్వంచ (Palvancha) పట్టణంలో వీఓఏలు నిరవధిక సమ్మెకు దిగారు. శనివారం పట్టణంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వీఓఏలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. గ్రామాల్లో పని అంతా తమతోనే చేయించుకుంటూ, తమ బతుకుల గురించి మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గత కొన్ని సంవత్సరాలుగా తాము రాత్రింబవళ్లు సేవలందిస్తున్నప్పటికీ కనీస వేతనం కూడా అందడం లేదని వాపోయారు. ప్రస్తుతం వస్తున్న అరకొర వేతనాలతో కుటుంబాలను పోషించలేక, ఆర్థిక ఇబ్బందులతో రోడ్డున పడే పరిస్థితి నెలకొందని కన్నీరుమున్నీరయ్యారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక మోసం చేయడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందని వారు విమర్శించారు. అందరు వీఓఏల వేతనాలు వెంటనే పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని, అలాగే దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఈ పోరాటాన్ని రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఐకేపీ వీఓఏల సంఘం అధ్యక్షురాలు అనురాధ, కార్యదర్శి రమేష్‌లతో పాటు జ్యోతి, సుమలత, పాల్వంచ పరిసర ప్రాంతాలకు చెందిన వీఓఏలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

