కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) ఉమ్మడి జిల్లాలో ఐకేపీ వీవోఏలు సమ్మె (IKP VOA Strike) బాట పట్టారు. విధులు బహిష్కరించి వరుసగా ఆందోళనలు నిరసనలు చేస్తున్నారు. నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలోని అన్ని మండల సమాఖ్య ఆఫీసుల ముందు నిరాహార దీక్షలు ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు..
పనికి తగిన వేతనం కావాలి
రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా జిల్లాలో 806 మంది వీవోఏలు సమ్మెలో పాల్గొంటున్నారు. నిత్యం గ్రామాలు, పట్టణాల్లో మహిళా సంఘాలకు అందుబాటులో ఉంటూ ఐకేపీ, బ్యాంకు రుణాలు అందించడం, పొదుపుపై, ప్రభుత్వ పథకాలపై అవగహన కల్పించడం వంటి పనుల కోసం శ్రమిస్తున్నా ప్రభుత్వం తమను గుర్తించడం లేదని ఆవేదన చెందుతున్నారు. వీవోఏలకు సెర్ప్ నుంచి రూ.5 వేల వేతనం రాగా, రూ.3 వేలు గ్రామ సంఘం ఇస్తోంది. ఈ వేతనం చాలడం లేదని వీవోఏలు ఆవేదన అంటున్నారు. కాంగ్రెస్ సర్కార్ మాట నిలబెట్టుకొని తమ హామీలు నెరవేర్చాలని, అప్పటి దాకా ఆందోళనలు సమ్మె కొనసాగిస్తామని చెబుతున్నారు…
డిమాండ్లు ఇవే…
– కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి
– సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఎర్ పాలసీ అమలు చేయాలి
– అర్హులైన వీవోఏలకు సీసీలుగా పదోన్నతి కల్పించాలి
– సాధారణ బీమా, ఆరోగ్య బీమా రూ.20 లక్షలు ఇవ్వాలి
– ట్యాబ్, నెట్ సౌకర్యం కల్పించాలి.
– జీవో 58ని సవరణ చేసి జాబ్ చాట్ ఇవ్వాలి
నిలిచిన సేవలు
ఐకేపీ ఉద్యోగుల సమ్మెతో బ్యాంకు లింకేజీ ప్రక్రియ, స్త్రీ నిధి రుణాల పంపిణీ నిలిచిపోయాయి. స్నేహ సంఘాలకు అవగాహన శిబిరాల నిర్వహణ రద్దు అయ్యింది. వృద్ధ మహిళలను గుర్తించి వారితో సంఘాలను ఏర్పాటు చేసే ప్రక్రియకు బ్రేక్ పడింది. దీంతో పలువురు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

