కలం, జనగామ: జనగామ (Jangaon) జిల్లా సర్పంచుల సంఘం కన్వీనర్‌గా నర్మెట గ్రామ సర్పంచ్ గోపగోని శ్రీధర్ గౌడ్ (Gopagoni Sridhar Goud)ను తెలంగాణ పంచాయతీ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డి నియమించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామ ప్రజల ఆమోదంతో సర్పంచులుగా ఎన్నికైన వారంతా చైతన్యవంతులై గ్రామాలను అభివృద్ధి చేయాలని సూచించారు. జనగామ జిల్లా కన్వీనర్ గోపగోని శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఇంతటి బాధ్యతను అప్పగించిన రాష్ట్ర కమిటీకి, జిల్లా కమిటీకి ధన్యవాదాలు తెలియజేశారు. తనతో ఏకగ్రీవంగా ఎన్నికైన అన్ని జిల్లాల కన్వీనర్లకు శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచులంతా సమన్వయంతో పని చేయాలని సూచించారు. పార్టీలకు అతీతంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రావలసిన నిధులను సమకూర్చుకోవాలన్నారు. అన్ని పథకాలను ప్రజలకు చేరవేస్తూ గ్రామాలను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గంతో పాటు జనగామ జిల్లా ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

