Mobile Popup Ad
Mobile Popup Ad

నేలకొండపల్లి బౌద్ధ మహాస్తూపానికి అంతర్జాతీయ రూపురేఖలు!

కలం, ఖమ్మం బ్యూరో : తెలంగాణ సాంస్కృతిక, చారిత్రక వైభవంలో మైలురాయిగా నిలిచిన నేలకొండపల్లి ( Nelakondapalli) బౌద్ధ మహాస్తూపాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కసరత్తును వేగవంతం చేసింది. తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ క్షేత్రం అభివృద్ధి కోసం ఇప్పటికే రూ. 2.50 కోట్ల నిధులు మంజూరయ్యాయి. అయితే, ఈ చారిత్రక క్షేత్రానికి అంతర్జాతీయ స్థాయి హంగులు అద్దేందుకు ఇంకా ఎంత వ్యయం అవుతుంది, ఎలాంటి ఆధునిక పనులు చేపట్టాలనే అంశాలపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు.

ఈ నేపథ్యంలో గురువారం వారసత్వ శాఖ ఉన్నత స్థాయి బృందం నేలకొండపల్లి బౌద్ధ మహాస్తూపాన్ని క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది. ​తెలంగాణ వారసత్వ శాఖ డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్ రావు కుతాటి, బుద్ధవనం ప్రాజెక్ట్ మెంటార్ సి.ఆంజనేయ రెడ్డి నేతృత్వంలోని ఉన్నతాధికారులు, పురావస్తు నిపుణుల బృందం నేలకొండపల్లి బౌద్ధ స్తూపాన్ని విస్తృతంగా పరిశీలించింది.

మంజూరైన నిధుల వినియోగంతో పాటు భవిష్యత్ నిధుల అంచనాలు, ల్యాండ్ స్కేపింగ్, పర్యాటక హంగుల రూపకల్పనపై నిపుణుల బృందం క్షేత్రస్థాయిలోనే సుదీర్ఘంగా సమీక్షించింది. కేవలం ఉపరితల తవ్వకాలకే పరిమితం కాకుండా, మాస్టర్ ప్లాన్‌లో భాగంగా నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NGRI) సహకారంతో ఇక్కడ భూగర్భ జియోఫిజికల్ సర్వే నిర్వహించాలని అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనిద్వారా భూగర్భంలో దాగివున్న చారిత్రక అవశేషాలను శాస్త్రీయంగా వెలికితీసి రక్షించనున్నారు.

​దీనితో పాటు పర్యాటక వసతుల విస్తరణ కోసం సుమారు నాలుగు ఎకరాల భూమిని సేకరించాలని అధికారులు తీర్మానించారు. ఇక్కడికి వచ్చే అంతర్జాతీయ పర్యాటకుల కోసం చరిత్రను ప్రతిబింబించేలా త్రీడీ ఇంటర్‌ప్రిటేషన్ సెంటర్, ఆడియో-విజువల్ గ్యాలరీలు, ఓపెన్ ఎయిర్ అంఫీ థియేటర్, అంతర్జాతీయ స్థాయి వాకింగ్ మార్గాలు, అత్యాధునిక లైటింగ్ వంటి మౌలిక వసతులను ఈ నివేదికలో చేర్చనున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదేశాల మేరకు పూర్తి వ్యయ అంచనాలతో కూడిన ఈ ‘సమగ్ర నివేదిక’ను రాబోయే రెండు నెలల్లో ప్రభుత్వానికి సమర్పిస్తామని వారసత్వ శాఖ డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్ రావు కుతాటి వెల్లడించారు. ఈ మాస్టర్ ప్లాన్ గనుక పూర్తయితే దక్షిణ భారతదేశంలోనే నేలకొండపల్లి ఒక ప్రముఖ అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక హబ్‌గా వెలుగొందుతుందనీ ఖమ్మం జిల్లా ప్రజలు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>