epaper
Sunday, March 1, 2026
epaper

15లోగా ఇంటి స్థలం, రూ.5లక్షలు.. మంత్రి పొంగులేటి హామీ

కలం, ఖమ్మం బ్యూరో: వెలుగుమట్ల బాధితులకు ఈ నెల 15వ తేదీ నాటికి ఇంటి స్థలం, రూ.5 లక్షలు ఇచ్చి.. దగ్గరుండి ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుడతానని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి (Ponguleti) పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. బాధితులకు ఇచ్చే ఇండ్ల దగ్గర అంగన్వాడీ కేంద్రం, పాఠశాల, తాగు నీరు, విద్యుత్ సౌకర్యం, తదితర అన్ని మౌలిక వసతులు కల్పిస్తామన్నారు.

ఆదివారం ఖమ్మం కలెక్టరేట్​లో మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ.. వెలుగుమట్లలో మొత్తం బాధితులు 720 మంది ఉన్నట్లు తెలిసిందన్నారు. వీరిలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, ఇతర ప్రాంతాల వాళ్లు ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. వీళ్లలో అర్హులైనవాళ్లకు తప్పకుండా న్యాయం చేస్తామని అన్నారు.

ఇది పేదల ఆశీర్వాదంతో వచ్చిన ప్రభుత్వమని, ఎట్టి పరిస్థితుల్లోనూ పేదలకు అన్యాయం జరగదని మంత్రి భరోసా ఇచ్చారు. వెలుగుమట్ల ప్రభుత్వ స్థలంలో ఇంటి పట్టాలు ఇప్పిస్తామని, కొందరు వ్యక్తులు డబ్బు వసూలు చేసినట్లు సమాచారం వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. ఎవరికి డబ్బులు ఇచ్చారో బాధితులు నిర్భయంగా పోలీసులకు చెప్పాలన్నారు. ఆ డబ్బు కూడా వచ్చేలా ప్రభుత్వం చేస్తుందని చెప్పారు.

గత పాలకులు పట్టాలివ్వక..

వెలుగుమట్ల అంశాన్ని కొందరు రాజకీయాలకు వాడుతున్నారని, తాము మాత్రం దీనిని కేవలం పేదల కోణంలోనే చూస్తున్నట్లు మంత్రి(Ponguleti) తెలిపారు. తప్పు ఒకరు చేస్తే, శిక్ష మరొకరికి పడినట్లు.. కొంతమంది తెలియక, అక్కడ పట్టాలు పొందామనే భ్రమలో ఇండ్లు కట్టుకున్నారని మంత్రి అన్నారు. బాధితులు ఎప్పటి నుంచి ఉంటున్నారో, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో అధికారులతో క్షుణ్ణంగా విచారణ చేయించి అర్హులకు తప్పనిసరిగా న్యాయం చేస్తామని మంత్రి చెప్పారు.

గత పాలకులు పట్టాలు పంపిణీ చేయని కారణంగానే నేడు కూల్చివేతలు జరిగాయని మంత్రి అన్నారు. ప్రతి అంశాన్ని రెచ్చగొట్టే ధోరణితో చూడవద్దని కోరారు. ‘రాజకీయాలు చేయాలంటే గీత గీసి మాట్లాడుదాం. ఎవరి చరిత్ర ఏంటో నాకు తెలుసు. దమ్ముంటే రావాల’ని సవాల్​ విసిరారు. ప్రతిపక్షాలు శవాల మీద చిల్లర ఏరుకునే ధోరణిలో వ్యవహరించకుండా, హుందాగా ఉండాలని హితవు పలికారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!