కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మహిళా ఐఏఎస్ అధికారిపై వచ్చిన వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తీవ్రంగా ఖండించారు. శనివారం తెలంగాణ ఐఎఫ్‌ఎస్ అధికారుల సంఘం (IFS Officers) కూడా ఈ వార్తలను తీవ్రంగా ఖండించింది. తెలంగాణ రాష్ట్ర ప్రజా సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న మహిళా ఐఏఎస్ ఆఫీసర్లపై తప్పుడు ప్రసారాలు చేయడం తగదని పేర్కొన్నది. ఈ ఆరోపణలు అసత్యమని, బాధ్యతలేని, అనైతికమైనవని సంఘం పేర్కొంది. ఈ మేరకు శనివారం ఆ సంఘం కార్యదర్శి, సీనియర్ ఐఎఫ్‌ఎస్ అధికారి ప్రియాంక వర్గీస్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
మహిళా ఐఏఎస్‌పై వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని, పరువు నష్టం కలిగించే విషయాలు ఉన్నాయని సంఘం (IFS Officers) వెల్లడించింది. ప్రజల కోసం సేవ చేస్తున్న మహిళా అధికారుల గౌరవం, గోప్యత, వృత్తిపరమైన ప్రతిష్ఠను పూర్తిగా అవమానించినట్టుగా ఈ ప్రసారం ఉందని అభిప్రాయపడింది. అధికారుల పోస్టింగ్‌లు, వ్యక్తిగత విషయాలపై చేసిన అన్ని ఆరోపణలను సంఘం పూర్తిగా తిరస్కరించింది. ఇటువంటి బాధ్యతలేని ప్రసారాలు నిజాయితీగా పనిచేస్తున్న అధికారుల ప్రతిష్ఠను దెబ్బతీస్తాయని… సంస్థలపై ప్రజల నమ్మకాన్ని తగ్గిస్తాయని పేర్కొంది. సంబంధిత ఛానళ్ళు వెంటనే బహిరంగంగా, షరతుల్లేని క్షమాపణ చెప్పాలని సంఘం డిమాండ్ చేసింది.
అభ్యంతరకరమైన ఈ కంటెంట్‌ను అన్ని మీడియా, డిజిటల్ వేదికల నుంచి తక్షణమే తొలగించాలని కోరింది. మహిళా అధికారులను లక్ష్యంగా చేసుకుని వారి గౌరవంపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని తెలంగాణ ఐఎఫ్‌ఎస్ అధికారుల సంఘం స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి దుష్ప్రచారాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఈ ఆరోపణలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తప్పుడు ప్రచారం చేయొద్దని సూచించారు.
Read Also: జిల్లాకు ఆధ్యాత్మిక వైభవం.. నాలుగు పుణ్యక్షేత్రాలతో టెంపుల్ సిటీ కారిడార్ !
Follow Us On : WhatsApp


