కలం, వెబ్‌డెస్క్: దిగ్గజ మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్ (Vinesh Phogat) కు ఐటీఏ (ITA) భారీ షాక్ ఇచ్చింది. గొండా టోర్నీకి ముందు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. దాదాపు 20 నెలల తర్వాత గోదాలోకి దిగనున్న వినేశ్.. తన రీఎంట్రీని అద్భుతంగా ఇవ్వాలని అనుకున్నారు. కానీ అదే సమయంలో ఐటీఏ వార్నింగ్ ఇవ్వడం కీలకంగా మారింది. డోపింగ్ పరీక్ష కోసం నిర్ణీత సమయంలో అందుబాటులో లేనందుకు ఆమెపై అధికారికంగా ఈ చర్య తీసుకుంది. నిబంధనల ప్రకారం.. టాప్ అథ్లెట్లు ప్రతిరోజూ ఒక గంట పాటు పరీక్షల కోసం అందుబాటులో ఉండాలి. అయితే, 2025 డిసెంబర్ 18న బెంగళూరులో వినేశ్ తన లొకేషన్‌లో లేకపోవడంతో అధికారి పరీక్ష చేయలేకపోయారు. దీనిపై ఆమె వివరణ ఇస్తూ.. ఆ రోజు హర్యానా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యానని, ప్రయాణం వల్ల సమాచారం అప్‌డేట్ చేయడం కుదరలేదని చెప్పారు.
కానీ, ఆమె వివరణను ఐటీఏ తోసిపుచ్చింది. టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పుడు అప్‌డేట్ చేయాల్సిన బాధ్యత అథ్లెట్‌దేనని స్పష్టం చేస్తూ, దీనిని ‘తొలి వైఫల్యం’గా రికార్డ్ చేసింది. ఈ వార్నింగ్ వల్ల వినేశ్‌కు ఇప్పుడే వచ్చే నష్టం ఏమీ లేదు. మే 10 నుంచి గొండాలో జరిగే ర్యాంకింగ్ టోర్నీలో ఆమె పాల్గొనవచ్చు. అయితే, ఏడాదిలో మూడుసార్లు ఇలా జరిగితే మాత్రం రెండేళ్ల నిషేధం తప్పదు. ఇక ఈ టోర్నీ మాజీ డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ కంచుకోటలో జరగనుండటం చర్చనీయాంశంగా మారింది. తనపై లైంగిక ఆరోపణలు చేసిన వారిలో వినేశ్ ఒకరు కావడంతో, ఈ పోరు ఇప్పుడు కేవలం క్రీడగానే కాకుండా సవాల్‌గా మారింది.

