కలం, వెబ్‌డెస్క్: ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup) 2026 టికెట్ల ధర ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారితీస్తోంది. భారీగా ఉన్న ఈ రేట్లు సాకర్ ప్రియులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఫైనల్ మ్యాచ్ ఒక్కో టికెట్ ఏకంగా రూ. 16 కోట్లకు (2 మిలియన్ డాలర్లు) రీసేల్ అవుతుండటంపై తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. వరల్డ్ కప్ టికెట్ ధరలు సామాన్యులకు అందనంత ఎత్తులో ఉన్నాయి. దీనిపై ‘ఫుట్‌బాల్ సపోర్టర్స్ యూరప్’ (FSE) సంస్థ మండిపడుతోంది. ఇది అభిమానులను మోసం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఐరోపా కమిషన్‌లో కేసు కూడా వేసింది. గడిచిన మార్చి నెలలో దాఖలైన ఈ దావాలో.. ధరలు విపరీతంగా పెంచేశారని పేర్కొంది.
ఈ నేపథ్యంలో ఈ రేట్లపై ఫిఫా ప్రెసిడెంట్ జియాని ఇన్ఫాంటినో (Gianni Infantino) స్పందించారు. ఈ ధరల సమర్థించారు. అమెరికా మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగానే ధరలు ఉన్నాయని ఆయన కుండబద్దలు కొట్టారు. బెవర్లీ హిల్స్‌లో జరిగిన ఒక సదస్సులో ఇన్ఫాంటినో ఈ విమర్శలపై స్పందించారు. డిమాండ్ పెరిగిందని చెప్పారు. గతంలో 5 కోట్ల అభ్యర్థనలు వస్తే, ఈసారి ఏకంగా 50 కోట్ల అభ్యర్థనలు వచ్చాయని చెప్పారు. దాంతో పాటుగా అమెరికాలో వినోద రంగానికి ఉన్న విలువను బట్టి రేట్లు నిర్ణయించామని, కాలేజీ గేమ్ చూడాలన్నా 300 డాలర్లు ఖర్చవుతుందని గుర్తుచేశారు. తాము తక్కువ ధరకు అమ్మినా, బయట వ్యక్తులు వాటిని భారీ ధరలకు రీసేల్ చేస్తున్నారని, అందుకే ఆ లాభం సంస్థకే దక్కాలని ధరలు పెంచామన్నారు.
ఈ సందర్భంగానే రీసేల్ మార్కెట్‌లో ఫైనల్ టికెట్ 20 లక్షల డాలర్లకు అమ్ముడవుతుండటంపై ఆయన స్పందిస్తూ.. ఒకవేళ ఎవరైనా నిజంగానే అంత డబ్బు పెట్టి కొంటే, వారికి తానే స్వయంగా హాట్ డాగ్, కోక్ అందించి ఆతిథ్యం ఇస్తానని చమత్కరించారు. గత ఖతార్ వరల్డ్ కప్ ఫైనల్ టికెట్ గరిష్ట ధర 1,600 డాలర్లు ఉండగా, 2026 నాటికి అది ఏకంగా 11,000 డాలర్లకు చేరింది. ధరల విషయంలో ఫిఫా వెనక్కి తగ్గేలా లేదు. విమర్శలు ఒకవైపు, భారీ క్రేజ్ మరోవైపు సాకర్ సమరాన్ని హీటెక్కిస్తున్నాయి.

