కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ (Hyderabad) నగరంలో మహిళల భద్రతకు భంగం కలిగిస్తూ, అసభ్యంగా ప్రవర్తించిన ఐదుగురు నిందితులకు కోర్టు ఏడు రోజుల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మే 27వ తేదీన నిజాం కాలేజీ పీజీ హాస్టల్ సమీపంలో తన భర్తతో కలిసి మోటార్ సైకిల్ పై వెళ్తున్న ఒక మహిళ పట్ల ఐదుగురు వ్యక్తులు మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించారు. బాధితురాలిని వేధింపులకు గురిచేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు అబిడ్స్ పోలీసులు తక్షణమే స్పందించి ఈ-పెట్టీ కేసులు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టు ముందు హాజరుపరిచారు.
ఈ కేసును విచారించిన హైదరాబాద్ మూడవ ప్రత్యేక జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు నిందితులు ఐదుగురిని దోషులుగా నిర్ధారించింది. సిటీ పోలీస్ యాక్ట్ లోని సెక్షన్లు 70(ఏ), 70(సి) కింద వారికి ఏడు రోజుల సాధారణ జైలు శిక్ష విధిస్తూ మే 29వ తేదీన తీర్పు వెలువరించింది. శిక్ష పడిన వారు నేపాల్ దేశానికి చెందిన వారిగా గుర్తించారు. వీరంతా ప్రస్తుతం కింగ్ కోఠి ప్రాంతంలో నివసిస్తూ, కేటరింగ్ కార్మికులుగా పని చేస్తున్నారు. అబిడ్స్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ నేతృత్వంలో సాగిన వేగవంతమైన విచారణ, కోర్టు కానిస్టేబుల్ ఎన్. రాజేశ్వర్ సమర్థవంతమైన సమన్వయం కారణంగా నిందితులకు తక్కువ కాలంలోనే శిక్ష పడింది.

