కలం, వెబ్‌డెస్క్: ఢిల్లీలో హైడ్రోజన్ ఆధారిత రెండు కొత్త షటిల్ బస్సులు సెంట్రల్ విస్టా (Central Vista) ప్రాంతంలో ప్రారంభమయ్యాయి. ఇవి ఒక్కసారి హైడ్రోజన్ నింపితే దాదాపు 250 కిలో మీటర్ల వరకు ప్రయాణించగలవు. ప్రస్తుతం రోజుకు సుమారు 180 కి.మీ. నడుస్తున్నాయి. రీఫ్యూయెలింగ్ కోసం ఈ బస్సులు ఫరీదాబాద్‌లోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ హైడ్రోజన్ స్టేషన్‌కు వెళ్లాల్సి వస్తోంది. ఈ బస్సుల్లో పైభాగంలో నాలుగు హైడ్రోజన్ సిలిండర్లు ఉంటాయి. మొత్తం సామర్థ్యం సుమారు 30 కిలోల హైడ్రోజన్. ఇవి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్సులు కావడంతో హైడ్రోజన్‌ను విద్యుత్తుగా మార్చి బస్సును నడుపుతాయి. అందుకే వీటిని జీరో ఎమిషన్ వాహనాలుగా చెబుతున్నారు.
అయితే ఈ టెక్నాలజీలో కొన్ని పెద్ద సవాళ్లు ఉన్నాయి. CNG బస్సు నడపడానికి కిలోమీటరుకు సుమారు రూ.60 ఖర్చు అయితే, హైడ్రోజన్ బస్సుల (Hydrogen Buses)కు కిలోమీటరుకు దాదాపు రూ.100 ఖర్చవుతోంది. ఇంకా హైడ్రోజన్ రీఫ్యూయెలింగ్ స్టేషన్లు తక్కువగా ఉన్నాయి. CNG స్టేషన్లను నేరుగా హైడ్రోజన్ కోసం మార్చడం సాధ్యం కాదు. నిపుణుల ప్రకారం, హైడ్రోజన్ వాహనాలు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఇవి పెద్ద స్థాయిలో నగర రవాణాకు ఆర్థికంగా అనుకూలంగా లేవు. హైడ్రోజన్ తయారీ, నిల్వ, రవాణా, మళ్లీ విద్యుత్తుగా మార్చే ప్రక్రియలో ఎక్కువ శక్తి నష్టం జరుగుతుంది. అందుకే ఎలక్ట్రిక్ బస్సులతో పోలిస్తే హైడ్రోజన్ బస్సుల సామర్థ్యంపై చర్చ కొనసాగుతోంది. హైడ్రోజన్ చాలా త్వరగా మండే పదార్థం కావడంతో భద్రతా పరమైన జాగ్రత్తలు కూడా అవసరం. ప్రస్తుతం లేహ్, లడఖ్‌లో కూడా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వాహనాల పైలట్ ప్రాజెక్టులు జరుగుతున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, హైడ్రోజన్ టెక్నాలజీ భవిష్యత్తులో షిప్పింగ్, పరిశ్రమలు, భారీ రవాణా రంగాల్లో ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉంది.

