కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరాన్ని ఆక్రమణల నుంచి రక్షిస్తున్న హైడ్రా (HYDRAA) విభాగంలో ట్రాన్స్‌జెండర్లు (Transgenders) సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. తమకు లభించిన ఉద్యోగాలతో సమాజంలో గౌరవాన్ని పొందుతూ, ఆర్థిక భరోసాతో ముందుకు సాగుతున్నారు. మొత్తం 16 మంది ట్రాన్స్‌జెండర్లకు హైడ్రా అవకాశం కల్పించింది. ఇందులో 11 మంది ట్రాన్స్ ఉమెన్, ఐదుగురు ట్రాన్స్ మెన్ ఉన్నారు. వీరికి ‘హైడ్రా ఈగల్ టీమ్’ గా ప్రత్యేక గుర్తింపు లభించింది.
గతంలో భిక్షాటనతో కాలం గడిపిన తాము, ఇప్పుడు బాధ్యత గల ప్రభుత్వ విధులను నిర్వహించడంపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా (HYDRAA) ఇచ్చిన ధైర్యంతో అక్రమార్కులకు ఏమాత్రం వెరవకుండా విధులు నిర్వహిస్తున్నారు. ఈ కొలువు కేవలం ఉపాధి మాత్రమే కాదని, తమ జీవితాలకు ఒక కొత్త గుర్తింపు అని వారు సంతోషంగా చెప్తున్నారు. హైడ్రా యూనిఫామ్ ధరించడం తమలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని స్పష్టం చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూర్‌లో 862 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడడంలో ఈగల్ టీమ్ చురుకైన పాత్ర పోషించింది. ఇటీవల మాదాపూర్‌లో ఈదులకుంట చెరువును రక్షించడంలో కీలక బాధ్యతలు నిర్వర్తించింది. ఆక్రమణలను తొలగించే సమయంలో ప్రజలకు నచ్చజెప్పడం, మహిళలతో మాట్లాడి పరిస్థితిని సర్దిచెప్పడం, అధికారులు, ప్రజల మధ్య సమన్వయం చేయడంలో వీరు అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నారు. పార్కులు, ప్రజావసరాల స్థలాలను కాపాడేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని ఈగల్ టీమ్ (Eagle Team) సభ్యులు సగర్వంగా ప్రకటిస్తున్నారు.
Read Also: కొత్త డిస్కం ఏర్పాటు వెనుక చీకటి కోణం : ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
Follow Us On: Instagram

