కలం, వెబ్ డెస్క్: జనసాంద్రత ఎక్కువగా ఉన్న పాతబస్తీలో గజం ఖాళీ స్థలం దొరకని పరిస్థితి. అయినప్పటికీ కొందరు ఏకంగా 7 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. వారి నుంచి హైడ్రా (HYDRA) విముక్తి కల్పించింది. ఈ భూమి విలువ దాదాపు రూ.400 కోట్లుగా అధికారులు అంచనా వేశారు.
హైదరాబాద్ జిల్లా బండ్లగూడ మండలం కందికల్ గ్రామంలోని మొహమ్మద్‌నగర్-లాలితాబాగ్ ప్రాంతంలో, రైల్వే ట్రాక్ సమీపంలో టౌన్ సర్వే నంబర్ 28, బ్లాక్-ఎఫ్, వార్డు నంబర్ 274లో మొత్తం 9.11 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 2 ఎకరాలు ఇప్పటికే కబ్జా అయి ఇళ్లు నిర్మాణమయ్యాయి. మిగిలిన 7 ఎకరాలను ఓ వ్యక్తి కుటుంబ సభ్యులు కబ్జా చేసి, చుట్టూ ఇనుప రేకులతో ప్రహరీ నిర్మించారు. లోపల ఏం జరుగుతుందో తెలియకుండా చేశారు.
రెవెన్యూ అధికారుల సమక్షంలో, పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా (HYDRA) అధికారులు ఆ ప్రహరీని తొలగించి, భూమి చుట్టూ శుక్రవారం కొత్త ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూమిగా గుర్తించే బోర్డులు పెట్టారు. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ప్రకారం అక్కడ చెరువు ఉన్నట్టు నిర్ధారణ అయింది. కానీ కబ్జాదారులు మట్టితో కప్పేసి చెరువు ఆనవాళ్లు లేకుండా చేశారు.
కబ్జాదారులపై భవానిపురం పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. కోర్టులో ఈ వివాదం కొనసాగిస్తూ వచ్చారు. దీంతో కోర్టు సమయం వృథా చేసినందుకు కోటి రూపాయల జరిమానా కూడా విధించింది. అయినా కబ్జా విడిచిపెట్టకుండా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. చివరగా కబ్జా నుంచి హైడ్రా కాపాడడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


