కలం, ఖమ్మం బ్యూరో : గొత్తి కోయల కోసం పోరాటం చేస్తామని జాగృతి అధ్యక్షురాలు కవిత(Kavitha) పేర్కొన్నారు. జనంబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆమె జాగృతి ఆధ్వర్యంలో మణుగూరు కోయగూడెం ఓపెన్‌కాస్ట్ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఓపెన్‌కాస్ట్ విస్తరణ పేరుతో నిర్వాసితులైన గొత్తికోయల గూడెం పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఓపెన్‌కాస్ట్ విస్తరణ కారణంగా 72 గొత్తికోయల కుటుంబాలను ఇక్కడి నుంచి తరిమేయడం సరికాదన్నారు. ప్రభుత్వం అత్యంత అమానుషంగా ప్రవర్తించిందని.. వారికి కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం ఇంకా దారుణమన్నారు.
మౌలిక వసతులు ఏవి?
నిర్వాసితులైన గొత్తికోయల గూడెంలో కనీస మౌలిక వసతులు కూడా లేవని వారు తెలిపారు. గూడానికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో పాటు విద్యుత్, తాగునీటి వసతులు లేవని, పిల్లల చదువుల కోసం స్కూల్ కూడా అందుబాటులో లేదని పేర్కొన్నారు. దీంతో అడవి బిడ్డలు రోజువారీ జీవితంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పరిస్థితికి పూర్తిగా సింగరేణి యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందని కవిత (Kavitha) పేర్కొన్నారు. నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతి కుటుంబానికి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు.
గొత్తికోయల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు తెలంగాణ జాగృతి తన పోరాటాన్ని ఆపబోమని జాగృతి నేతలు హెచ్చరించారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు ప్రజల పక్షాన నిలబడి ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు.
Read Also: KCR కీలక నిర్ణయం.. అనౌన్స్ చేసిన KTR
Follow Us On : WhatsApp


