కలం, నేషనల్ డెస్క్ : యుద్ధం ఇక భూమిపైనే కాదు.. అంతరిక్షంలోనూ జరగనుంది..?! నేలపై ఆధిపత్యం కోసం ఇన్నాళ్లూ సరిహద్దుల్లో వ్యూహాలు రచించిన సూపర్ పవర్ దేశాలు.. ఇప్పుడు నేరుగా నింగిలోనే రణరంగాన్ని సిద్ధం చేసుకుంటున్నాయి. చరిత్రలోనే మొదటిసారిగా అంతరిక్ష కక్ష్యలో అత్యాధునిక ఆయుధాలను మోహరించినట్లు అమెరికా అధికారికంగా ప్రకటించడంతో.. రాబోయే రోజుల్లో స్పేస్ కూడా ప్రధాన యుద్ధ క్షేత్రంగా మారడం ఖాయంగా కనిపిస్తున్నది. అమెరికా వేసిన ఈ ముందడుగు.. గ్లోబల్ డిఫెన్స్ రంగంలో సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తున్నది.
ప్రస్తుతం వివిధ దేశాల సైనిక వ్యూహాలన్నీ అంతరిక్షంలోని ఉపగ్రహాలపైనే నడుస్తున్నాయి. సైన్యాల కదలికలకు కీలకమైన జీపీఎస్, రహస్య సమాచార మార్పిడి, క్షిపణి హెచ్చరిక వ్యవస్థలు, శత్రువులపై నిఘా.. ఇలా ఎన్నో కీలక కార్యకలాపాలు శాటిలైట్ల ద్వారానే సాగుతున్నాయి. దీంతో యుద్ధ సమయంలో ప్రత్యర్థి దేశాల ఉపగ్రహ వ్యవస్థలను నిర్వీర్యం చేయడం కీలక వ్యూహంగా మారింది. ఇప్పుడు అమెరికా మోహరించిన ‘ఆన్-ఆర్బిట్’ ఆయుధం నేరుగా అంతరిక్షంలోనే శత్రు ఉపగ్రహాలను లక్ష్యంగా చేసుకోగలదు.
ఆయుధం ఏంటి? ఎందుకు రహస్యం?
అమెరికా కక్ష్యలో మోహరించిన ఆయుధాల (US Space Weapons) అసలు స్వరూపం మాత్రం ఇంకా రహస్యంగానే ఉంది. వాటి సంఖ్య ఎంత? ఏ కక్ష్యలో ఉన్నాయి? వాటి పరిధి ఎంత? ఏ రకమైన దాడులు చేయగలవు? అనే వివరాలను అమెరికా వెల్లడించలేదు. ఈ గోప్యతే ఇప్పుడు మరిన్ని అనుమానాలకు తావిస్తున్నది. ఒకవేళ ఇవి ప్రత్యర్థి ఉపగ్రహాలను నేరుగా ధ్వంసం చేసే కైనెటిక్ ఆయుధాలైతే.. అంతరిక్ష శిథిలాల ముప్పు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అదే జామింగ్ లేదా ఇతర నాన్-కైనెటిక్ వ్యవస్థలైతే.. భౌతికంగా ఉపగ్రహాన్ని పేల్చకుండా దాని సామర్థ్యాన్ని నిర్వీర్యం చేయవచ్చు. అసలు అమెరికా ఏ టెక్నాలజీని కక్ష్యలోకి తీసుకెళ్లిందనేది బయటకు వస్తే.. ప్రపంచ అంతరిక్ష వ్యూహంలో మరిన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది.
స్పేస్ ఫోర్స్ పాత్ర కీలకం
2019లో ఏర్పాటైన యూఎస్ స్పేస్ ఫోర్స్.. అంతరిక్షంలో అమెరికా సైనిక ప్రయోజనాల రక్షణ కోసం పనిచేస్తున్నది. ఉపగ్రహాలు, అంతరిక్ష ఆధారిత వ్యవస్థలకు ఎదురయ్యే ముప్పులను గుర్తించడం, వాటిని నిరోధించడం, అవసరమైన సందర్భాల్లో ఎదుర్కొనే సామర్థ్యాలను అభివృద్ధి చేయడం దాని ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ఇప్పటివరకు ప్రధానంగా రక్షణాత్మక పాత్రపై దృష్టి పెట్టిన స్పేస్ ఫోర్స్.. ఇప్పుడు ‘స్పేస్ కంట్రోల్’ సామర్థ్యాలపై మరింత దృష్టి సారిస్తున్నది.
ఒప్పందం ఏం చెబుతోంది?
అంతరిక్షంలో ఆయుధాల మోహరింపుతో అంతర్జాతీయ చట్టాల అంశం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 1967 నాటి ‘ఔటర్ స్పేస్ ట్రీటీ’.. భూమి చుట్టూ కక్ష్యలో అణు ఆయుధాలు లేదా ఇతర సామూహిక వినాశకర ఆయుధాలను మోహరించడాన్ని నిషేధిస్తుంది. అయితే సంప్రదాయ ఆయుధాలను కక్ష్యలో ఉంచడంపై అదే స్థాయిలో స్పష్టమైన నిషేధం లేదు. అగ్రరాజ్యాలు ఈ ఖాళీని ఎలా ఉపయోగించుకుంటాయన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.
అంతరిక్షమే తొలి రణరంగం
భవిష్యత్తులో ఒక పెద్ద యుద్ధం మొదలైతే తొలి దాడి భూమిపై ఉన్న సైనిక స్థావరాలపై కాకుండా.. వందల కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతున్న ఉపగ్రహాలపైనే జరిగే అవకాశం ఉందన్నది రక్షణ నిపుణుల ఆందోళన. కమ్యూనికేషన్ కట్ చేయడం.. జీపీఎస్ను దెబ్బతీయడం.. నిఘా వ్యవస్థలను నిర్వీర్యం చేయడం.. ఇలా యుద్ధం మొదలయ్యే ముందే ప్రత్యర్థి దేశాన్ని సమాచార పరంగా బలహీనపర్చే ప్రయత్నాలు జరగొచ్చు. అమెరికా తాజా ప్రకటన ఆ భవిష్యత్తు యుద్ధానికి ముందస్తు సంకేతమా? లేక ప్రత్యర్థి దేశాలకు ఇచ్చిన హెచ్చరికా? అన్నది కాలమే తేల్చాలి.
స్పేస్ కంట్రోల్ అంటే
‘స్పేస్ కంట్రోల్’ అంటే కేవలం శత్రు ఉపగ్రహాలను కూల్చేయడం మాత్రమే కాదు. తమ ఉపగ్రహాలు, అంతరిక్ష ఆధారిత సైనిక వ్యవస్థలు నిరంతరాయంగా పనిచేసేలా చూడటం.. అదే సమయంలో ప్రత్యర్థి దేశాల అంతరిక్ష సామర్థ్యాలను అడ్డుకోవడం లేదా నిర్వీర్యం చేయడం ఇందులో భాగం. జామింగ్, కమ్యూనికేషన్ వ్యవస్థలకు అంతరాయం కలిగించడం, సిగ్నల్స్ ను దెబ్బతీయడం నుంచి అవసరమైతే శత్రు అంతరిక్ష వ్యవస్థలను ధ్వంసం చేయడం వరకు వివిధ సామర్థ్యాలు ఇందులో ఉంటాయి.
అందరికీ పెద్ద ముప్పే..!
అంతరిక్షంలో యుద్ధం మొదలైతే దాని ప్రభావం ఒక్క దేశానికే పరిమితం కాదు. ఒక ఉపగ్రహాన్ని పేల్చివేస్తే వేలాది చిన్న చిన్న శిథిలాలు కక్ష్యలోకి విసిరిపడే ప్రమాదం ఉంది. వీటిని ‘స్పేస్ డెబ్రిస్’ అంటారు. ఇవి వేగంగా ప్రయాణిస్తూ ఇతర ఉపగ్రహాలను ఢీకొంటే మరిన్ని శిథిలాలు ఏర్పడొచ్చు. ఇలా ఒకదాని తర్వాత మరొకటి ఉపగ్రహాలు దెబ్బతినే పరిస్థితి తలెత్తవచ్చు. దీంతో సైనిక ఉపగ్రహాలే కాదు.. కమ్యూనికేషన్, వాతావరణ, నావిగేషన్ వంటి సాధారణ పౌర ఉపగ్రహాలకూ ముప్పు ఏర్పడుతుంది. అందుకే అంతరిక్షంలో నేరుగా పేలుళ్లకు దారితీసే ఆయుధాల వినియోగంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు ఉన్నాయి.
అంతరిక్షంలో ఆయుధ పోటీ?
తన వద్ద ‘స్పేస్ కంట్రోల్’ ఆయుధాలు ఉన్నాయని అమెరికా తొలిసారి బహిరంగంగా అంగీకరించడంతో.. అంతరిక్షంలో ఆయుధ పోటీ మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చైనా, రష్యాలు తమ కౌంటర్-స్పేస్ సామర్థ్యాలను వేగంగా పెంచుకుంటున్నాయి. ఇతర ఉపగ్రహాలపై దాడి చేయగల సామర్థ్యం ఉన్న ఉపగ్రహాలను రష్యా కక్ష్యలోకి పంపిందని అమెరికా గతంలో ఆరోపించింది. చైనా కూడా కౌంటర్-స్పేస్ టెక్నాలజీల అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నది. ఈ నేపథ్యంలో అమెరికా తాజా ప్రకటనతో.. ఇరు దేశాలు తమ అంతరిక్ష రక్షణ, దాడి సామర్థ్యాలను మరింత వేగంగా అభివృద్ధి చేసే అవకాశాలపై చర్చ మొదలైంది.
యుద్ధం ఇక పాత పద్ధతిలో కాదు :యూఎస్ ఎయిర్ ఫోర్స్ సెక్రటరీ ట్రాయ్ మెయింక్
న్యూయార్క్: అంతరిక్షంలో తాము ‘స్పేస్ కంట్రోల్ వెపన్స్’ మోహరించినట్లు అమెరికా రక్షణ శాఖ తొలిసారి అధికారికంగా వెల్లడించింది. మేరీల్యాండ్లో జరిగిన ‘ఎయిర్, స్పేస్ అండ్ సైబర్ కాన్ఫరెన్స్’లో అమెరికా ఎయిర్ ఫోర్స్ సెక్రటరీ ట్రాయ్ మెయింక్ సోమవారం ఈ కీలక విషయాన్ని వెల్లడించారు. అయితే, కక్ష్యలో మోహరించిన ఆయుధాల్లో ఎలాంటి సాంకేతికతను ఉపయోగిస్తున్నారు? వాటి సంఖ్య ఎంత? ఎప్పటి నుంచి అక్కడ ఉన్నాయి? వంటి వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు.
రానున్న రోజుల్లో యుద్ధ రంగం స్వరూపం పూర్తిగా మారిపోనుందని ట్రాయ్ మెయింక్ పేర్కొన్నారు. 2032 నాటికి అమెరికా వైమానిక దళం మరింత ఆధునిక రూపాన్ని సంతరించుకుంటుందని వివరించారు. భవిష్యత్తు యుద్ధాల్లో సంప్రదాయ ఆయుధ వ్యవస్థలతో పాటు ‘వన్-వే ఎటాక్ డ్రోన్లు’ కీలక పాత్ర పోషించనున్నాయని చెప్పారు.

