బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ శిక్ష

కలం, నల్లగొండ : మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి నల్లగొండ (Nalgonda) లోని పోక్సో కేసుల ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీవ్రమైన శిక్షలు ఖరారు చేస్తూ చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. తిప్పర్తి మండలానికి చెందిన నిందితుడు మహమ్మద్ ఖయ్యూంకు 23 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు యావజ్జీవ శిక్ష విధిస్తూ న్యాయమూర్తి గురువారం తీర్పు వెలువరించినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. గతంలో ఇదే మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడు ఖయ్యూంపై తిప్పర్తి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఆ కేసులో నేరం రుజువు కావడంతో కోర్టు అతనికి గతంలోనే 51 సంవత్సరాల కారాగార శిక్ష, జరిమానా విధించింది. అయితే, అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితుడు మళ్లీ అదే బాలికను అపహరించి, పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై నల్గొండ టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి పోలీసులు సమగ్ర దర్యాప్తు జరిపారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ శిక్షలు ఖరారు చేసింది.

నేరస్థుడికి కఠిన శిక్ష పడేలా సమర్థవంతంగా సాక్ష్యాధారాలు సేకరించి దర్యాప్తు చేసిన నాటి ఎస్‌ఐ ఎస్.సంపత్, నాటి ఎస్డీపీఓ వి.నర్సింహారెడ్డి, ప్రస్తుత డీఎస్పీ శివరాం రెడ్డి, సీఐలు ఆది రెడ్డి, శ్రీను నాయక్, ఎస్‌హెచ్‌ఓ సైదా బాబు, కోర్టు సిబ్బందిని, వాదనలు వినిపించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్‌ను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. మైనర్ బాలికలు, మహిళల భద్రత విషయంలో రాజీపడేది లేదని, నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>