ఖిలా వరంగల్‌ కేంద్రంగా బై నంబర్ల మాయాజాలం!

కలం, వరంగల్‌ బ్యూరో: ప్రభుత్వ భూములకు రక్షణ కరవవుతోందా..? నిషేధిత జాబితాలోని సీలింగ్‌ భూములే అక్రమార్కులకు ఆదాయంగా మారుతున్నాయా..? రెవెన్యూ రికార్డుల్లోని ఉప సర్వే నంబర్లతో మార్పులు చేసి కోట్ల విలువైన భూములను ప్రైవేటు పరం చేస్తున్నారా..? ఖిలా వరంగల్‌ తహసీల్దార్‌ ఆఫీసు కేంద్రంగా తిమ్మాపూర్‌ భూముల వ్యవహారం (Warangal Land Scam) ఇలాంటి ప్రశ్నలనే లేవనెత్తుతోంది. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారుల తీరుపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విచారణలు జరుగుతున్నా.. షోకాజ్‌ నోటీసులతోనే సరిపెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎయిర్‌పోర్టు ప్రకటనతో రూ.కోట్ల భూమిపై కన్ను

మామునూరు ఎయిర్‌పోర్టు పునరుద్ధరణ ప్రకటనతో పరిసర ప్రాంతాల్లో భూముల ధరలకు భారీగా డిమాండ్‌ పెరిగింది. ఇదే అదనుగా తిమ్మాపూర్‌ రెవెన్యూ పరిధి సర్వే నం.188లో సుమారు ఎకరం 20 గుంటల ప్రభుత్వ సీలింగ్‌ భూమిపై అక్రమార్కులు కన్నేశారనే ఆరోపణలు ఉన్నాయి. సుమారు రూ.6 కోట్ల విలువైనదిగా చెబుతున్న ఈ భూమి రిజిస్ట్రేషన్‌ చట్టంలోని సెక్షన్‌ 22-ఏ(1)(డి) కింద నిషేధిత జాబితాలో ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు సూచిస్తున్నాయి. గతంలో ఉన్నతాధికారులు ఆంక్షలు విధించినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

బై నంబర్లతో బదలాయింపులు

నిషేధిత సర్వే నం. 188ను 188/ఏ/1/1/1, 188/ఏ/1/1/2 వంటి బై సర్వే నంబర్లుగా విభజించి ప్రైవేటు వ్యక్తుల పేరిట రికార్డుల్లో నమోదు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గుంటల చొప్పున ప్లాట్లుగా విభజించి నాన్‌ లేఅవుట్‌ వెంచర్లకు మార్గం సుగమం చేశారనే విమర్శలు ఉన్నాయి. క్లస్టర్‌ ఆర్‌ఐలు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ ఫైళ్లు ఇతర మార్గాల్లో కదిలించి మ్యుటేషన్లు, డిజిటల్‌ సంతకాలు పూర్తి చేసినట్లు సమాచారం. నిషేధిత భూములపై ఇలాంటి మార్పులు ఎలా జరిగాయన్నదే ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది.

నోటీసులతోనే సరా..?

ఈ భూముల వ్యవహారంపై ‘కలం’ వరుస కథనాలతో ఉన్నతాధికారుల్లో కదలిక వచ్చినట్లు తెలుస్తోంది. జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ సంధ్యారాణి విచారణ చేపట్టినట్లు సమాచారం. కలెక్టర్‌ ఆదేశాల మేరకు సంబంధిత అధికారికి షోకాజ్‌ నోటీసు జారీ చేసినట్లు తెలిసింది. అయితే కోట్ల విలువైన ప్రభుత్వ భూముల వ్యవహారంలో విచారణలు, నోటీసులు తప్ప చర్యలు ముందుకు సాగకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కీలక ఫైల్‌ మాయం

వివాదాస్పద భూమికి సంబంధించిన కీలక ఫైల్‌ అందుబాటులో లేకపోవడం మరిన్ని సందేహాలకు తావిస్తోంది. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసిన వారికి ఫైళ్లు అందుబాటులో లేవని అధికారులు సమాధానం ఇస్తున్నా.. ఉన్నతాధికారులు మాత్రం విచారణ కొనసాగుతోందని చెబుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఫైల్‌ గల్లంతుపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను తేల్చాలని డిమాండ్లు వస్తున్నాయి.

పెద్దలపై చర్యలు ఎప్పుడు?

చిన్న ఉద్యోగులపై ఆరోపణలు వచ్చిన వెంటనే సస్పెన్షన్లు, బదిలీలకు పాల్పడే అధికారులు.. కోట్ల విలువైన ప్రభుత్వ భూముల వ్యవహారంలో ఉన్నతాధికారులపై చర్యలకు ఎందుకు వెనుకాడుతున్నారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వివాదాస్పద అధికారికి జిల్లా స్థాయి ఉన్నతాధికారి అండదండలు ఉన్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అధికారిక నిర్ధారణ కావాల్సి ఉండగా ఏమీ తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి.

భూములు కాపాడేదెవరు?

తిమ్మాపూర్‌ రెవెన్యూ పరిధిలోని సీలింగ్ భూమిపై ఆరోపణల నేపథ్యంలో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లపై సమగ్ర విచారణ జరిపి అక్రమాలు నిర్ధారణైతే రద్దు చేయాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో పారదర్శకత పాటించాలని, చిన్న ఉద్యోగులకే పరిమితం కాకుండా ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపైనా సమానంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>